భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన జీ20 ప్రతినిధుల బృందం

జీ20 హెల్త్‌ వర్కింగ్‌ గ్రూపు మూడో సమావేశం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రతినిధుల బృందం జీనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ ప్లాంటును సందర్శించింది.

Published : 08 Jun 2023 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీ20 హెల్త్‌ వర్కింగ్‌ గ్రూపు మూడో సమావేశం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రతినిధుల బృందం జీనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ ప్లాంటును సందర్శించింది. దేశీయంగా కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ను ఆవిష్కరించిన ఈ ప్లాంటును చూసి, ప్రతినిధులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. యూకే ప్రతినిధి అలెజాండ్రో బియోండి రోడ్రిగ్జ్‌ మాట్లాడుతూ ‘ఇది నిజంగా గొప్ప అనుభూతి. టీకాల ఉత్పత్తిలో ఉన్న సాంకేతికతను గమనించడం ద్వారా అనేక విషయాలను నేర్చుకున్నామ’ని తెలిపారు. జీ20 గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రతినిధి ఎబిలీ ఆండీ మాట్లాడుతూ.. భారత్‌ బయోటెక్‌ ప్రయాణం గొప్ప స్ఫూర్తిని కలిగిస్తోందన్నారు. ఈ సంస్థను ‘షైనింగ్‌ స్టార్‌’గా అభివర్ణించారు. భారత్‌తో పాటు, ప్రపంచానికి అవసరమైన టీకాలను ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించడంపై ఒమన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సుల్తానా మహ్మద్‌ అల్‌ సబాహి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న వ్యాక్సిన్‌ అభివృద్ధి పనులు అద్భుతంగా ఉన్నాయని కెనడాకు చెందిన రోషన్‌ మూసా అన్నారు. జీనోమ్‌ వ్యాలీలో ఉన్న ఇతర పరిశోధన సంస్థలనూ మరో బృందం పరిశీలించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు