గృహరుణంపై టాపప్‌ తీసుకోవచ్చా?

నేను ఆరేళ్ల క్రితం ఒక యూనిట్‌ ఆధారిత జీవిత బీమా పాలసీ (యులిప్‌) తీసుకున్నాను. దీనికి ప్రతి ఆరు నెలలకు రూ.30వేలు చెల్లిస్తున్నాను. ఈ పాలసీలో కాస్త మంచి రాబడే కనిపిస్తుంది.

Updated : 10 Sep 2021 05:52 IST

నెలనెలా బంగారంలో మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వచ్చిన రాబడిపై పన్ను ఉంటుందా?

- కవిత

మీరు నేరుగా బంగారాన్ని కొనాలంటే.. చిన్న  మొత్తాలతో సాధ్యం కాదు. దాని రక్షణ కూడా ఇబ్బందికరమే. ఇలాంటి చిక్కులు లేకుండా.. తక్కువ డబ్బుతో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ద్వారా లేదా గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు మూడేళ్ల తర్వాత డబ్బు వెనక్కి తీసుకుంటే... వచ్చిన లాభంపై 20 శాతం పన్ను (సెస్సు అదనం) వర్తిస్తుంది. ముందే తీసుకుంటే.. అంతకుముందే వెనక్కి తీసుకుంటే.. స్వల్పకాలిక మూలధన పన్ను వర్తిస్తుంది. అప్పుడు నిబంధనల మేరకు వర్తించే శ్లాబుల ఆధారంగా  పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


నేను ఆరేళ్ల క్రితం ఒక యూనిట్‌ ఆధారిత జీవిత బీమా పాలసీ (యులిప్‌) తీసుకున్నాను. దీనికి ప్రతి ఆరు నెలలకు రూ.30వేలు చెల్లిస్తున్నాను. ఈ పాలసీలో కాస్త మంచి రాబడే కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని రద్దు చేసుకొని, డబ్బును వెనక్కి తీసుకోవచ్చా? దీనివల్ల ఏదైనా నష్టం ఉంటుందా?

- ప్రశాంత్‌

చాలా వరకూ యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లను అయిదేళ్ల లోపు స్వాధీనం చేస్తే కొన్ని రుసుములు వర్తిస్తాయి. కానీ, డబ్బులు పాలసీ అయిదేళ్లు పూర్తయ్యాకే వెనక్కి ఇస్తారు. మీరు పాలసీని తీసుకొని, ఆరేళ్లు అయ్యింది. కాబట్టి, మీరు పాలసీని వెనక్కి ఇచ్చినా స్వాధీన రుసుములు వర్తించవు. ఇప్పుడు స్టాక్‌ మార్కెట్ల పనితీరు బాగుంది. అందువల్ల మీ పాలసీ కూడా మంచి రాబడిని అందిస్తోంది. మీకు డబ్బులు కచ్చితంగా అవసరం ఉంటేనే ఆ యులిప్‌ను రద్దు చేసుకోండి. లేకపోయినా పాలసీ రద్దు చేసుకుంటాను అని అనుకుంటే.. వెనక్కి వచ్చిన డబ్బులను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి మళ్లించండి.


నా దగ్గర రూ.3 లక్షలు ఉన్నాయి. వీటిని మా బాబు పేరుమీద కనీసం 10 ఏళ్ల వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేద్దామని అనుకుంటున్నాను. ఇది మంచి ఆలోచనేనా? తక్కువ నష్టభయం ఉన్న పథకాలేమైనా ఉన్నాయా?

- మురళి

ప్రస్తుతం మన దేశంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైన 5-5.5% మాత్రమే రాబడి వస్తోంది. మీరు పెట్టే పెట్టుబడి మీ బాబు ఉన్నత చదువులకు ఉపయోగపడాలి అనుకుంటే.. విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోవాలి. దీనికోసం హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు 10 ఏళ్లపాటు సుమారు 11 శాతం రాబడి అంచనాతో పెట్టుబడిని కొనసాగిస్తే.. దాదాపు రూ.8,51,826 అయ్యేందుకు అవకాశం ఉంది.


ఇంటి కోసం రూ.5లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాను. వడ్డీ 15 శాతం. ఇంకా నాలుగేళ్లు చెల్లించాలి. దీనికి బదులుగా ఇంటి రుణంపై టాపప్‌ తీసుకొని, దీన్ని చెల్లించేయడం మంచిదేనా?

- నరేందర్‌

మీరు తీసుకున్న వ్యక్తిగత రుణంపైన వడ్డీ చాలా అధికంగా ఉంది. ఇప్పుడు గృహరుణంపై వడ్డీ రేట్లు చాలా వరకూ తగ్గాయి. గృహరుణంపై టాపప్‌పై వడ్డీ కొంచెం అధికంగానే ఉంటుంది. కానీ, వ్యక్తిగత రుణంతో పోలిస్తే తక్కువే. మీకు ఇప్పటికే ఉన్న వ్యక్తిగత రుణాన్ని ముందే తీరిస్తే కొంత ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. బాకీ ఉన్న మొత్తంపై 5-6శాతం వరకూ ముందస్తు రుసుము చెల్లించాలి. వ్యక్తిగత రుణం చెల్లించేముందు బ్యాంకుతో మాట్లాడి, రుసుము తగ్గిస్తారేమో చూడండి. ఇంకా నాలుగేళ్లు వ్యక్తిగత రుణం చెల్లించాలి కాబట్టి, ముందే తీరిస్తే వడ్డీ రూపంలో చాలా మొత్తం ఆదా అవుతుంది.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని