బ్యాంకులు అడ‌గకుండానే రుణాల‌ను ఆఫ‌ర్ చేసేందుకు కార‌ణం..

బ్యాంకుల నుంచి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ లేదా వ్య‌క్తిగ‌త రుణం కావాలా అని అడుగుతుంటారు. చాలామంది వీటిని ప‌ట్టించుకోరు. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు రుణాల‌ను ఇచ్చేందుకు మార్కెటింగ్ జిమ్మిక్కులు చేస్తుంటాయి. దీంతో కొంత‌మంది ఉచ్చులో ప‌డుతుంటారు. డిసెంబ‌ర్ 2017 నుంచి డిసెంబ‌ర్

Published : 23 Dec 2020 15:45 IST

బ్యాంకుల నుంచి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ లేదా వ్య‌క్తిగ‌త రుణం కావాలా అని అడుగుతుంటారు. చాలామంది వీటిని ప‌ట్టించుకోరు. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు రుణాల‌ను ఇచ్చేందుకు మార్కెటింగ్ జిమ్మిక్కులు చేస్తుంటాయి. దీంతో కొంత‌మంది ఉచ్చులో ప‌డుతుంటారు. డిసెంబ‌ర్ 2017 నుంచి డిసెంబ‌ర్ 2018 వ‌ర‌కు చూసుకుంటే క్రెడిట్ కార్డ్ ఖాతాలు 28.60 శాతం పెరిగాయి. అదేవిధంగా వ్య‌క్తిగ‌త రుణ ఖాతాలు కూడా ఇదే కాలంలో 29.30 శాతం పెరిగాయి. మ‌రోవైపు గృహ, వాహ‌న రుణాలు 10 శాతం, ఆస్తి రుణాలు 30 శాతం వృద్ధి చెందాయి. ఇక్క‌డ రెండు ర‌కాల రుణాలు ఉంటాయి. ఒక‌టి ఇంటిని నిర్మించ‌డం లేదా కొనుగోలు చేసేందుకు, మ‌రోటి హాలిడే లేదా వివాహం కోసం తీసుకునే రుణాలు. గ‌త కొన్నేళ్లుగా చూసుకుంటే ఈ ర‌క‌మైన రుణాల‌కు డిమాండ్ పెరిగింది. రిటైల్ రుణాలు ఈ కాలంలో స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 2007 లో మొత్తం రుణాల్లో రిటైల్ రుణాలు 27 శాతం ఉండ‌గా, ఏప్రిల్ 2013 లో అది 18 శాతానికి ప‌డిపోయింది. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో 26 శాతానికి పెరిగిన‌ట్లు ఆర్‌బీఐ వెల్ల‌డించింది.

ఎందుకు బ్యాంకులు రిటైల్ రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి?

గ‌త కొన్నేళ్లుగా కార్పొరేట్‌, ఎంఎస్ఎంఈ రుణాల విభాగంలో నిర‌ర్థ‌క ఆస్తులు పెరిగిపోవ‌డంతో బ్యాంకులు రిటైల్ విభాగంలో రుణ వృద్ధి కొర‌కు కృషి చేస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 2018 నాటికి స్థూల ఎన్‌పీఏలు రంగాలు, సేవ‌ల విభాగం నుంచి 20.9 శాతం, 6 శాతంగా న‌మోద‌య్యాయి. అదేవిధంగా రిటైల్ విభాగంలో ఇవి 2.1 శాతంగా ఉన్నాయి.
అయితే ఇటీవ‌ల‌ ఆర్‌బీఐ ఇత‌ర రంగాల‌, సేవ‌ల విభాగాల‌తో పోలిస్తే వ్య‌వసాయం రంగంలో ఎక్కువ‌గా నిర‌ర్థ‌క ఆస్తులు పెరిగిన‌ట్లు వెల్ల‌డించింది. క్రెడిట్ కార్డ్ విభాగంలో బ్యాంకుల‌ ఆస్తుల నాణ్య‌త మెరుగ్గానే ఉంద‌ని ఇక్రా తెలిపింది. రిటైల్ విభాగంలో ఇవి ఎక్కువ రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. క్రెడిట్ కార్డ్ కేటగిరీలో ఎన్‌పీఏలు 2 శాతం త‌క్కువ‌గా ఉన్నాయి.

విశ్లేష‌ణ‌:

అయితే బ్యాంకులు ఏ వినియోగ‌దారుడికి ఏ ర‌క‌మైన రుణాల‌ను ఇవ్వాలో ఎలా తెలుసుకుంటాయంటే, మీరు బ్యాంకుతో చేసేలాదేవీల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు సినిమా టిక్కెట్ల‌ను కొనేందుకు ఎక్కువ‌గా నెట్‌బ్యాంకింగ్‌ను ఉప‌యోగిస్తుంటే బ్యాంకులు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల‌ను కొన్ని ప్ర‌యోజ‌నాల‌తో క‌లిపి ఆఫ‌ర్ చేస్తుంటాయి. దీంతో ఇత‌ర వినియోగ‌దారుల‌తో పోలిస్తే మీరు ఆ ఆఫ‌ర్‌ను పొందేందుకు ఆస‌క్తి చూపుతారు. ఎవ‌రికి ఏ ర‌క‌మైన రుణాలు కావాలో తెలుసుకొని ఆఫ‌ర్ చేస్తే రుణాలు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

రుణ చెల్లింపులు, క్రెడిట్ బ్యూరోల‌ను నుంచి తెలుసుకునే స‌మాచారం రిటైల్ రుణాల్లో రిస్క్‌ను త‌గ్గించేందుకు వీలుంటుంది. గ‌త ప‌దేళ్ల నుంచి క్రెడిట్ బ్యూరోలు వినియోగ‌దారు స‌మాచారాన్ని బ్యాంకుల‌కు పక్కాగా ఇస్తున్నాయి. దీంతో బ్యాంకుల‌కు రిస్క్ త‌గ్గించుకునే అవ‌కాశం ఉంటుంది.

సుల‌భంగా రుణాలు ల‌భించ‌డం:

రుణాలు సుల‌భంగా ల‌భించ‌డం కూడా రుణ వృద్థికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్పుకోవ‌చ్చు. గ‌త కొన్నేళ్లుగా డిజిట‌ల్ వినియోగం పెర‌గ‌డం, ఆన్‌లైన్ రుణాల‌తో ప్రాసెసింగ్ త‌గ్గ‌డం వంటివి డిమాండ్ పెంచుతున్నాయి. 15-20 ఏళ్ల క్రితం గృహ రుణం లేదా వాహ‌న రుణం తీసుకోవాలంటే చాలా క‌ష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా సుల‌భంగా ఈ రుణాలు ల‌భిస్తున్నాయి. రుణాల‌ను తీసుకొని ఈఎమ్ఐల రుపంలో చెల్లించ‌డం అనువుగా మారింది. దీంతో క్రెడిట్ కార్డ్, వ్య‌క్తిగ‌త రుణ వృద్ధి పెరిగింది. ఇత‌ర గృహ‌, వాహ‌న రుణ వృద్ధి సాధార‌ణంగానే ఉంది.

మీరేం చేయాలి?

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో సుల‌భంగా ల‌భించే రుణాలు ఉప‌యోగ‌క‌ర‌మే అయినా, అవ‌స‌రం లేక‌పోయినా ఇస్తున్నారు క‌దా అని రుణం తీసుకుంటే అప్పుల వ‌ల‌లో చిక్కుకునే అవ‌కాశం ఉంటుంది. ఇవి రుణ చ‌రిత్ర‌పై కూడా ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో రుణాలు ల‌భించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలోనే రుణం తీసుకోండి. అవ‌స‌రం లేన‌ప్పుడు లేదా తిరిగి చెల్లించే సామ‌ర్థ్యం లేన‌ప్పుడు వాటికి దూరంగా ఉండండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని