Economy: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్‌

Economy: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల నిర్వహణలో విఫలమైందని కాంగ్రెస్‌ ఆరోపించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇలా ప్రతి అంశంలో ప్రభుత్వం ఎలాంటి పురోగతి కనబర్చడం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

Published : 24 Sep 2023 19:52 IST

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ (Indian Economy) నిర్వహణలో భాజపా ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా అసమర్థంగా వ్యవహరిస్తోందని విమర్శించింది. పైగా గణాంకాలు తారుమారు చేస్తోందని ఆరోపించింది.

అదానీ స్కామ్‌, కుల గణన, పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation), ఆర్థిక అంతరాల్లో పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. గణాంకాలను ఎంత సవరించినా.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నది మాత్రం వాస్తవమని వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయం ఆర్‌బీఐ విడుదల చేసిన 2023 సెప్టెంబర్‌ బులెటిన్‌ను చూస్తే స్పష్టమవుతోందన్నారు. 2020 ఫిబ్రవరిలో 43 శాతం మంది ప్రజలు శ్రామిక శక్తిలో ఉన్నారని తెలిపారు. మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా ఆ సంఖ్యలో పెద్దగా మార్పు లేదన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ నివేదిక ప్రకారం.. 2021- 22లో 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు.

నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరుగుతున్నాయని జైరాం రమేశ్‌ అన్నారు. ఇటీవలి వరకు టమాటాల ధరలు నియంత్రణ లేకుండా పెరిగాయని తెలిపారు. జనవరి నుంచి కంది పప్పు ధరలు 45 శాతానికి పైగా పెరిగాయన్నారు. మొత్తంగా పప్పు దినుసుల ద్రవ్యోల్బణం 13.4 శాతానికి చేరిందన్నారు. ఆగస్టు నుంచి పిండి ధరలు 20 శాతం పెరిగాయన్నారు. బెల్లం, చక్కెర ధరలు సైతం ఎగబాకుతున్నాయని తెలిపారు. నిత్యావసరాల ధరలు నియంత్రణ లేకుండా పెరగడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 

మోదీ ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారి విధానం వల్ల ఆర్థిక ఫలాలన్నీ కొన్ని ఎంపిక చేసిన కంపెనీలకే చెందుతున్నాయని జైరాం ఆరోపించారు. ఫలితంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పోటీ పడలేకపోతున్నాయని తెలిపారు. ప్రైవేట్‌ సెక్టార్‌కు ఇచ్చే రుణాలే వృద్ధికి ఊతమిస్తాయని తెలిపారు. 2004 నుంచి 2014 మధ్య ఈ రుణాల్లో స్థిర వృద్ధి నమోదైందని వరల్డ్‌ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయన్నారు. కానీ, 2014 నుంచి రుణాల మంజూరులో స్తబ్దత నెలకొందని తెలిపారు. 2021లో దేశీయ రుణాల్లోని వృద్ధి 2014తో పోలిస్తే 51 శాతం తగ్గిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని