Startup: దేశంలో 84,102 అంకుర సంస్థలు

దేశంలో 84 వేలకు పైగా స్టార్టప్‌లు ఉన్నట్ల కేంద్రం తెలిపింది. లోక్‌సభకు ఇచ్చిన ఓ సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Published : 07 Dec 2022 20:27 IST

దిల్లీ: ఈ ఏడాది నవంబరు 30 నాటికి దేశంలో 84,102 అంకుర సంస్థల్ని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో బుధవారం ఓ సభ్యుడు అడిగి ప్రశ్నకు సమాధానం ఇస్తూ వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ ఈ వివరాలను వెల్లడించారు. ‘స్టార్టప్‌ ఇండియా’ పథకం 2016లో ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ‘డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (DPIIT)’ అర్హతగల కంపెనీలను అంకుర సంస్థలుగా గుర్తిస్తుంది. వీటికి పన్ను మినహాయింపు వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను కల్పిస్తుంది.

వ్యవసాయం, బయోటెక్నాలజీ, రసాయనాలు సహా మొత్తం 56 రంగాలకు అంకుర సంస్థలు విస్తరించాయని సోమ్‌ ప్రకాశ్‌ తెలిపారు. స్టార్టప్‌లకు వివిధ దశల్లో మూలధనాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’, ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ క్యాపిటల్‌’ వంటి పథకాల్ని తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. నవంబరు 30 నాటికి రూ.10 వేల కోట్ల ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం నుంచి రూ.7,527.95 కోట్లను ‘ఆల్టర్నేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌’కు బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే రూ.925 కోట్ల ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీం’ నుంచి రూ.455.25 కోట్లు 126 అంకురాలకు కేటాయించినట్లు వెల్లడించారు. వీటిలో రూ.186.15 కోట్లు ఇప్పటికే మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ అత్యధిక స్టార్టప్‌లు కలిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ముందువరుసలో ఉన్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని