HCL Tech Q4 Results: హెచ్‌సీఎల్‌ లాభం రూ.3,983 కోట్లు

HCL Tech Q4 Results: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సంస్థ గతేడాది చివరి త్రైమాసికంలో 3,983 కోట్ల నికర లాభభాన్ని ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.18 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Published : 20 Apr 2023 21:28 IST

దిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ (HCL Tech) మార్చితో ముగిసిన త్రైమాసికానికి (Q4 Results) ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.3,983 కోట్ల ఏకీకకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,593 కోట్లతో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం. డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చినప్పుడు మాత్రం నికర లాభం 3 శాతం మేర క్షీణించడం గమనార్హం.

సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం రూ.22,597 కోట్ల నుంచి 18 శాతం వృద్ధి చెంది రూ.26,606 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంతో పోల్చినప్పుడు ఆదాయం సైతం రూ.26,700 కోట్ల నుంచి స్వల్పంగా క్షీణించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మధ్యంతర డివిడెండ్‌ కింద ఒక్కో షేరుకు రూ.18 చొప్పున చెల్లించేందుకు హెచ్‌సీఎల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 28ని రికార్డు డేట్‌గా నిర్ణయించింది.  మే 9న చెల్లింపులు చేయనున్నారు. గత త్రైమాసికంలో కొత్తగా 3674 మంది ఉద్యోగులను నియమించుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.25 లక్షలు దాటినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6-8 శాతం ఆదాయ వృద్ధిని, 18-19 శాతం మేర ఆపరేషన్స్‌ మార్జిన్లు అంచనా వేస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ సీఈఓ, ఎండీ సి విజయ్‌ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని