క్రెడిట్‌కార్డుల జారీకి HDFC బ్యాంక్‌ బిగ్‌ప్లాన్‌.. యూత్‌ కోసం త్వరలో డిజిటల్‌ కార్డ్‌

గతంలో నిషేధం కారణంగా దాదాపు 8 నెలల పాటు క్రెడిట్‌కార్డులు జారీ చేయలేకపోయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇప్పుడు వాటి విషయంలో దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

Published : 19 Dec 2022 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) క్రెడిట్‌ కార్డుల (Credit cards) జారీపై దృష్టి సారించింది. ప్రస్తుతం 29 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్న ఈ బ్యాంక్‌.. రాబోయే రోజుల్లో దూకుడు పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నెలకు 10 లక్షల చొప్పున క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సంఖ్య 5 లక్షలుగా ఉందని కంపెనీ పేమెంట్స్‌ బిజినెస్‌ హెడ్‌ పరాగ్‌ రావు తెలిపారు.

ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ రిటైల్‌, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు పరాగ్‌ తెలిపారు. అలాగే రెండు విమాన సంస్థలు, ఓ పెద్ద హోటల్‌ చైన్‌తోనూ ఈ భాగస్వామ్యం ఉండబోతోందని చెప్పారు. కార్డుల జారీతో పాటు వాటి ద్వారా వినియోగదారులు అధిక ప్రయోజనం పొందేలా చూడాలని నిర్ణయించినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా ఓ కొత్త డిజిటల్‌ క్రెడిట్‌ కార్డు తీసుకొస్తున్నామని, అది తుది దశలో ఉందని తెలిపారు.

యూపీఐకి రూపే క్రెడిట్‌కార్డులను అనుసంధానానికి ఆర్‌బీఐ అనుమతిచ్చిన నేపథ్యంలో వీటిపైనా దృష్టి సారించినట్లు పరాగ్‌ పేర్కొన్నారు. పోటీ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి పెద్ద ఎత్తున రివార్డులను అందిస్తున్నాయని, తాము మాత్రం ఆ వ్యూహాన్ని అనుసరించబోమని పేర్కొన్నారు. భారీ డిస్కౌంట్లు తాము ఎప్పుడూ ఇవ్వలేదని.. మున్ముందూ అలా అనిపించుకోవాలని లేదని చెప్పారు. గతంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆర్‌బీఐ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు షాకిచ్చింది. కొత్త క్రెడిట్‌ కార్డు కస్టమర్లను చేర్చుకునే విషయంలో ఆంక్షలు విధించింది. దీంతో దాదాపు 8 నెలల పాటు ఆ బ్యాంక్‌ కొత్తగా క్రెడిట్‌ కార్డులను జారీ చేయలేకపోయింది. గతేడాదే ఆ నిషేధం తొలగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని