Infosys: ఇన్ఫోసిస్‌కు మరో కీలక ఉద్యోగి గుడ్‌బై.. ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషీ రాజీనామా

Infosys president resigns: ఇన్ఫోసిస్‌లో రెండు దశాబ్దాలుగా సేవలందించిన ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 11 Mar 2023 13:15 IST

దిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) నుంచి నెలల వ్యవధిలో మరో ఉన్నతాధికారి వైదొలిగాడు. సంస్థ ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషీ (Mohit Joshi) తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి కంపెనీ శనివారం సమాచారమిచ్చింది. ‘‘ఇన్ఫోసిస్‌ అధ్యక్షుడు మోహిత్‌ జోషీ నేడు రాజీనామా చేశారు. మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉండనున్నారు. జూన్‌ 9, 2023.. కంపెనీలో ఆయన చివరి పనిదినం’’ అని సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. (Infosys president resigns)

ఇన్ఫోసిస్‌ (Infosys) ఫైనాన్షియల్‌ సర్వీసెస్, హెల్త్‌కేర్‌/లైఫ్‌ సైన్సెస్‌ బిజినెస్‌కు నేతృత్వం వహిస్తున్న మోహిత్ జోషీ (Mohit Joshi).. 2000 సంవత్సరంలో సంస్థలో చేరారు. రెండు దశాబ్దాలకు పైగా సంస్థలో విభిన్న స్థాయుల్లో పనిచేశారు. ఎడ్జ్‌వర్వ్‌ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు కంపెనీ తరఫున జోషీ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన రాజీనామా వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత గోవాలో జరిగిన ఇన్ఫీ లీడర్‌షిప్‌ సమావేశంలో ఆయన పాల్గొనకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది.

ఇన్ఫీని వీడిన జోషీ.. మరో టెక్‌ సంస్థ టెక్‌ మహీంద్రాలో చేరారు. ఈ మేరకు టెక్‌ మహీంద్రా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. జోషీని.. తమ నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పేర్కొంది. ప్రస్తుత టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ.. ఈ ఏడాది డిసెంబరు 19న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున జోషీ.. గుర్నారీ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నట్లు సంస్థ తమ ప్రకటనలో తెలిపింది.

కాగా.. ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్‌ (Infosys)ను వీడిన రెండో కీలక వ్యక్తి ఈయన. అంతకుముందు గతేడాది అక్టోబరులో కంపెనీ ప్రెసిడెంట్‌గా ఉన్న రవి కుమార్‌ ఎస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన కాగ్నిజెంట్‌లో చేరి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని