Fixed-line Service: ‘ఫిక్స్‌డ్‌-లైన్‌’లోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టిన జియో

ఫిక్స్‌డ్‌-లైన్‌ సేవల విభాగంలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనకబడింది. ఆగస్టులో ఆ స్థానాన్ని జియో సొంతం చేసుకుంది. 

Published : 19 Oct 2022 15:06 IST

దిల్లీ: ఇప్పటికే టెలికాం, బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడంలో దూసుకెళ్తున్న రిలయన్స్‌ జియో తాజాగా దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్‌-లైన్‌ సేవల ప్రొవైడర్‌గానూ నిలిచింది. ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టింది. ఆగస్టులో జియో వైర్‌లైన్‌ ఖాతాదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరగా, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 71.32 లక్షలుగా ఉన్నారు. భారత్‌లో టెలికాం సేవలు ప్రారంభమైన తర్వాత ఈ విభాగంలో ఓ ప్రైవేటు సంస్థ తొలిస్థానానికి చేరడం ఇదే తొలిసారి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ గత 22 ఏళ్లుగా వైర్‌లైన్‌ సేవల్ని అందిస్తోంది. జియో ఈ రంగంలోకి ప్రవేశించి మూడేళ్లు మాత్రమే అవుతోంది. జులైలో 2.56 కోట్లుగా ఉన్న వైర్‌లైన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆగస్టులో 2.59 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఈ విభాగంలో ప్రైవేటు రంగానిదే ఆధిపత్యం. జియో కొత్తగా 2.62 లక్షల కస్టమర్లను పెంచుకోగా.. భారతీ ఎయిర్‌టెల్‌ 1.19 లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 4,202, టాటా టెలీసర్వీసెస్‌ 3,769 మంది చందాదారులను జత చేసుకున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ 15,734, ఎంటీఎన్‌ఎల్‌ 13,395 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి.

మరోవైపు దేశంలో టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆగస్టులో 117.5 కోట్లకు చేరింది. ఈ విభాగంలోనూ అత్యధిక మంది కొత్త చందాదారులను ఆకర్షించడంలో జియోనే ముందుంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆగస్టు నెలలో జియో 32.81 లక్షలు, భారతీ ఎయిర్‌టెల్‌ 3.26 లక్షల మంది కొత్త కస్టమర్లను జత చేసుకున్నాయి. అదే సమయంలో అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా 19.58 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 5.67 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌ 470, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 32 మంది కస్టమర్లను కోల్పోయింది.

జులైలో 80.74 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆగస్టులో 81.39 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో 42.58 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ 22.39 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా 12.31 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.58 కోట్లు, ఆట్రియా కన్వర్జెన్స్‌కు 21.3 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ చందాదారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని