RIL AGM: రిలయన్స్‌ నుంచి కీలక ప్రకటన.. బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్‌

Jio Financial Services: జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ బీమా రంగంలోకి అడుగుపెట్టనుంది. సాధారణ, ఆరోగ్య బీమా పాలసీలు అందించనుంది. రిలయన్స్‌ ఏజీఎంలో ఈ మేరకు ప్రకటన వెలువడింది.

Published : 28 Aug 2023 18:44 IST

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరుపడి ఇటీవల స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు (Jio Financial Services) సంబంధించి రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రవేశించనుందని చెప్పారు. ఈ మేరకు రిలయన్స్‌ 46వ వార్షిక సాధారణ సమావేశంలో (RIL AGM) దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

‘‘జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బీమా విభాగంలోకి అడుగు పెడుతుంది. సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా సేవలను అందిస్తుంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్‌ వేదికగా ఈ సేవలను అందించనున్నాం’’ అని ముకేశ్‌ అంబానీ తెలిపారు. ‘‘ఆగస్టు 21న జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఒక్కో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు గానూ ఒక్కో జేఎఫ్‌ఎస్‌ షేరు కేటాయించాం. ఇదీ వాటాదారులకు మినీ బోనస్‌గా భావిస్తున్నాం’’ అని అంబానీ అన్నారు. ఇది అత్యంత మూలధనంతో కూడుకున్న వ్యాపారమని, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నికర విలువ రూ.1.2 లక్షల కోట్లని తెలిపారు. జియో, రిలయన్స్‌ రిటైల్‌ తరహాలో జియో ఫైనాన్షియల్‌ వ్యాపారం సైతం రాణిస్తుందని చెప్పారు.

డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 5జీ.. వినాయక చవితికి ఎయిర్‌ఫైబర్‌

అలాగే, అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ అయిన బ్లాక్‌రాక్‌తో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకున్న రిలయన్స్‌.. ఆ సంస్థతో కలిసి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నెలకొల్పనున్నట్లు ముకేశ్‌ అంబానీ తెలిపారు. జాయింట్‌ వెంచర్‌గా ఇది ఏర్పాటు అవుతుందని చెప్పారు. మరోవైపు జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు మరోసారి నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో 2.10 శాతం నష్టంతో రూ.210.10 వద్ద ముగిశాయి. ఏజీఎంలో ముకేశ్‌ అంబానీ జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గురించి ప్రస్తావనకు రాగానే షేర్లు ఒక్కసారిగా 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని