RIL AGM: డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 5జీ.. వినాయక చవితికి ఎయిర్‌ఫైబర్‌

Jio 5g- JioAirFiber: డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. వినాయక చవితికి ఎయిర్‌ఫైబర్‌ సేవలను ప్రారంభించనున్నారు.

Updated : 28 Aug 2023 17:16 IST

ముంబయి: గతేడాది 5జీ సేవలు ప్రారంభించిన రిలయన్స్‌ జియో.. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా ఆ సేవలను తీసుకురానున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. ఈ మేరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశంలో (RIL AGM)  ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు జియో ఫైబర్‌ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా ఎయిర్‌ఫైబర్‌ డివైజ్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే, జియో ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌, జియో 5జీ ఫోన్ల గురించి మాత్రం ఈ ఏజీఎంలో ప్రస్తావించలేదు. 

జియో టెలికాం సేవలను చందాదారుల సంఖ్య 45 కోట్లు దాటిందని ముకేశ్‌ అంబానీ తెలిపారు. 5జీ సేవలను ప్రారంభించిన 9 నెలల్లోనే 96 శాతం పట్టణాల్లో 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ పూర్తయినట్లు తెలిపారు. డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్త సేవల విస్తరణ లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 5 కోట్ల మంది జియో 5జీ సేవలను ఆనందిస్తున్నారని చెప్పారు. జియో ద్వారా నెలకు సగటున 25జీబీ డేటా వినియోగం జరుగుతోందని తెలిపారు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 19న జియో ఎయిర్‌ఫైబర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలిపారు. అయితే, దీని ధర, ప్లాన్లు, ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. జియో ఫైబర్‌ నెట్‌ విస్తరణకు ఎయిర్‌ఫైబర్‌ తోడ్పనుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RIL AGM: బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్‌ ఎంట్రీ.. కీ అప్‌డేట్స్‌ ఇవీ..

అందరికీ AI

రిలయన్స్‌ ఏజీఎంలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (AI) గురించీ ముకేశ్‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవం నడుస్తోందని, ఏఐ అప్లికేషన్లు పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలు, రోజువారీ జీవితంతోనూ భాగస్వామ్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏఐ విప్లవంలో రిలయన్స్‌ సైతం భాగస్వామ్యం అవుతోందన్నారు. ఏడేళ్ల క్రితం జియో బ్రాండ్‌ గురించి హామీ ఇచ్చి ఎలా నెరవేర్చామో.. అదే తరహాలోనే ఏఐని జియో అన్ని చోట్లా, అందరికీ అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు. ప్రతి పౌరుడికీ, వ్యాపారికీ, ప్రభుత్వానికీ ఉపయోగపడేలా జియో ప్లాట్‌ఫామ్స్‌ ఇండియా స్పెసిఫిక్‌ ఏఐ మోడల్స్‌ను, ఏఐ పవర్డ్‌ సొల్యూషన్లను అందించనుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని