LIC IPO: ప్రారంభమైన ఎల్‌ఐసీ మెగా ఐపీఓ.. దరఖాస్తు చేసుకుంటారా మరి?

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ మెగా పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO) ప్రారంభమైంది.....

Updated : 04 May 2022 10:47 IST

ముంబయి: ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ మెగా పబ్లిక్‌ ఇష్యూ (LIC IPO) ప్రారంభమైంది. నేటి నుంచి ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 వరకు అందుబాటులో ఉంటుంది. పబ్లిక్‌ ఇష్యూ (Public issue) ధరల శ్రేణి రూ.902-949గా ప్రకటించారు. అయితే పాలసీదార్లకు రూ.60; రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంటు ఇస్తున్నారు. సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికి అధిక స్పందన రావడం విశేషం. ఈ నేపథ్యంలో రిటైల్‌ మదుపర్లు, పాలసీదార్లు (Policyholders), తొలిసారి పబ్లిక్‌ ఇష్యూ (Public issue)కు దరఖాస్తు చేసుకుంటున్న వారూ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

Also Read: ఎల్‌ఐసీ షేర్లు కొనాలా వద్దా? బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?

చాలా వరకు విశ్లేషకులు ఈ ఐపీఓ (IPO)పై బులిష్‌గానే ఉన్నారు. 30 కోట్ల వరకు పాలసీదార్లు; 13 లక్షల మంది ఏజెంట్లు ఉన్న ఈ సంస్థ మొత్తం బీమా ప్రీమియంలో (2020-21) 64 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. 2019-20లో రూ.5.7 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయంతో భారత బీమా మార్కెట్‌ రికార్డు సృష్టించింది. ఇందులో ఎల్‌ఐసీ (LIC)కి రూ.3.8 లక్షల కోట్ల ఆదాయం దక్కింది. ‘ఈ ఐపీఓకి దరఖాస్తు చేయొచ్చు. అయితే స్వల్పకాలానికి కాదు.. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏడాది తర్వాత మళ్లీ వాటా విక్రయం ఉండొచ్చు. కాబట్టి వేచి ఉండాలి’ అని జీసీఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ఛైర్మన్‌ రవి సింఘాల్‌ అంటున్నారు.

Also Read: ఎల్‌ఐసీ ఐపీఓకి ఇలా దరఖాస్తు చేసుకోండి!

ఇతర నమోదిత బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO) ధర సహేతుకంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. రూ.902-949 ధర వద్ద ఐపీఓ విలువను చూస్తుంటే.. 2021-22 ప్రైస్‌ టు ఎంబెడెడ్‌ వేల్యూ(పీ/ఈవీ) విలువకు 1.1 రెట్లు ఉంది. మొత్తం మీద ఆకర్షణీయ విలువలు, భారీ ఆస్తులు, బలమైన బ్రాండ్‌ విలువ తదితరాల వల్ల ఐపీఓ (IPO)కు మొగ్గుచూపొచ్చని ఎక్కువమంది మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: 29 కోట్ల మంది పాలసీదారులు.. లక్షకు పైగా ఉద్యోగులు! LIC గురించి 10 విషయాలు

పాలసీదారులకు సంక్షిప్త సందేశాలు..

ఈ పబ్లిక్‌ ఇష్యూను విజయవంతం చేయడానికి ఎల్‌ఐసీ చర్యలు చేపట్టింది. మంగళవారం పాలసీదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించింది. ఈ ఐపీఓకు సంబంధించి మరిన్ని వివరాలు గురించి తెలుసుకునేందుకు గత నెల 24న సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన సమాచారాన్ని సంబంధిత లింక్స్‌ ద్వారా చదవాలని సూచించింది.

పూర్తి వివరాలు.. 10 పాయింట్లలో

  1. సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించనుంది. భారత ఈక్విటీ మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ (IPO).
  2. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902-949గా నిర్ణయించారు. కనీసం 15 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే గరిష్ఠ ధర వద్ద మదుపర్లు కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి షేర్లు మే 16న బదిలీ అవుతాయి. మే 17న  స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు నమోదు కానున్నాయి.
  3. రిటైల్‌ విభాగంలో తన పాలసీదారులు కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయనుంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 2.21 కోట్ల (0.35%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.60 రాయితీ సైతం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీలో వాటాదారులుగా మారేందుకు అవకాశం లభించింది.
  4. తమ ఉద్యోగుల కోసం కూడా ఎల్‌ఐసీ ప్రత్యేకంగా 15.81 లక్షల (0.025%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.45 రాయితీ దక్కనుంది. రిటైల్‌ మదుపర్లకు కూడా ఇంతే మొత్తంలో రాయితీ లభించనుంది.
  5. 50 శాతం షేర్లు క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (QIBs) కేటాయించారు. దీంట్లో 60 శాతం వాటాను యాంకర్‌ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు. నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వె స్టర్లకు 15 శాతం, రిటైల్‌ మదుపర్లకు 15 శాతం వాటాలను కేటాయించారు.
  6. ఎల్‌ఐసీ విలువ (LIC IPO)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఏకీకృత వాటాదారుల విలువగా పరిగణించే సంస్థ ఎంబెడెడ్‌ విలువను సెప్టెంబరు 30, 2021 నాటికి రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు. 
  7. తొలుత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓ (IPO)లో విక్రయించి రూ.63,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, మార్కెట్‌లో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో పరిమాణాన్ని రూ.21,000 కోట్లకు తగ్గించారు.
  8. ఫిబ్రవరి 13న ఎల్‌ఐపీ పబ్లిక్‌ ఇష్యూ (LIC Public offer) కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. మార్చిలో అనుమతి లభించింది.
  9. ఈ ఐపీఓ ద్వారా సమకూరే నిధులన్నీ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. 2022-23లో మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  10. ఎల్‌ఐసీకి 13 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. 29 కోట్ల మంది పాలసీదారులకు సేవలందిస్తోంది. జనవరి 2022 నాటికి కొత్త బిజినెస్‌ ప్రీమియం వసూలులో ఈ సంస్థ మార్కెట్‌ వాటా 61.6 శాతం. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం.. 2020లో జీవిత బీమా కొనుగోలు 3.2 శాతం పెరిగింది. ఇది ప్రపంచ సగటుకు దాదాపు సమానం. ఈ రంగంలో 2019-2023 మధ్య ఏటా 5.3 శాతం వృద్ధి నమోదు కానుందని అంచనా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని