Ola Electric IPO: ఏడాది చివరికల్లా ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓ..!

Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్‌ త్వరలో ఐపీఓకు రానుంది. ఐపీఓ విలువ ఎంతనేది తెలియరాలేదు.

Published : 25 May 2023 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric IPO) త్వరలో ఐపీఓకు రానుంది. ఈ ఏడాది చివరికల్లా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం గోల్డ్‌మన్‌ శాక్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకులను షేర్‌ సేల్‌ కోసం నియమించుకుంది. ఈ ప్రక్రియ కోసం మరిన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులతో జట్టుకట్టే అవకాశం ఉంది.

ఓలా ఎలక్ట్రిక్‌లో ప్రస్తుతం సాఫ్ట్‌ బ్యాంక్‌, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ పెట్టుబడులు ఉన్నాయి. 2022లో నిధుల సమీకరణ సమయంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విలువను 5 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఇప్పుడు ఐపీఓలో భాగంగా అంతకంటే మార్కెట్‌ విలువతో ఐపీఓకు వచ్చేందుకు ఓలా ఎలక్ట్రిక్‌ సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ మార్కెట్‌ విలువకు 10 శాతం షేర్లను విక్రయించినా దేశీయంగా అతిపెద్ద ఐపీఓగా ఓలా ఎలక్ట్రిక్ నిలవనుంది.

ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేయడం, మార్కెటింగ్‌, ఏడాది చివరికల్లా లిస్ట్‌ అవ్వడం అనేది కష్టంతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ, ఎలాగైనా ఈ ఏడాది చివరికల్లా ఐపీఓకు రావాలని ఓలా ఎలక్ట్రిక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భవీశ్‌ అగర్వాల్‌ పట్టుదలతో ఉన్నారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిసింది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కార్యకలాపాలను విస్తరణకు వినియోగించాలని ఓలా ఎలక్ట్రిక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న ఈ కంపెనీ.. త్వరలో విద్యుత్‌ కారును సైతం తీసుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు