Piyush Goyal: ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు మూలస్తంభంగా భారత్‌!

స్థిరమైన వృద్ధి(Growth)ని ప్రదర్శించడంతోపాటు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలిచిన నేపథ్యంలో.. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ(Economic Revival)కు భారత్‌ మూలస్తంభంగా...

Published : 30 Sep 2022 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్థిరమైన వృద్ధిని ప్రదర్శించడంతోపాటు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలిచిన నేపథ్యంలో.. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ(Economic Revival)కు భారత్‌ మూలస్తంభంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. బెంగాల్‌ ఛాంబర్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా మంత్రి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని భాగస్వాములందరూ కర్తవ్య భావంతో కలిసి పనిచేస్తే.. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న జాతీయ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. 2030 నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

‘భారత్‌ ఇప్పటికే ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కొన్నేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా అన్ని వనరులను సమకూర్చుకుంటోంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రధాని మోదీ విజన్‌’ అని గోయల్‌ అన్నారు. వ్యవసాయం, తయారీ, నిర్మాణం తదితర అన్ని రంగాలు మంచి వృద్ధి కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. ‘భారత్‌ సుస్థిరత కలిగిన దేశం. కొవిడ్‌ సమయంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. స్థిరమైన వృద్ధి మార్గంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు మూలస్తంభంగా నిలుస్తుంది’ అని మంత్రి అభిప్రాయపడ్డారు.

పెట్టుబడులకు భారత్‌ అత్యుత్తమ కేంద్రమని గోయల్‌ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని, మరిన్నింటినీ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. తయారీ రంగంలో భారత్‌ గ్లోబల్‌ హబ్‌గా ఎదిగేలా.. టైర్- 2, టైర్- 3 నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. సులభతర వ్యాపార నిర్వహణ విషయమై ప్రభుత్వంతో మరిన్ని చర్చలు జరపాలని, ఎఫ్‌టీఏ(స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) చర్చల్లో చురుకుగా పాల్గొనాలని మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని