Jio Book: జియో మరో సంచలనం.. ₹15 వేలకే ల్యాప్‌టాప్‌?

జియోబుక్‌ పేరిట రిలయన్స్‌ జియో తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చే యోచనలో ఉంది. 4జీ ఆధారిత సిమ్‌ ద్వారా ఇది పనిచేసేలా రూపొందించినట్లు సమాచారం.

Updated : 03 Oct 2022 14:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలికాం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. జియోఫోన్‌ విడుదలతో అందుకున్న విజయాన్ని మరోసారి మరో కొత్త ప్రోడక్ట్‌తో రుచి చూసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అతి తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జియోబుక్‌ పేరిట తీసుకురానున్న ఈ ల్యాప్‌టాప్‌ 4జీ ఆధారిత సిమ్‌తో పనిచేసేలా రూపొందించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. 

జియోబుక్‌ తయారీ కోసం రిలయన్స్ జియో ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజాలైన క్వాల్‌కామ్‌, మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సదరు ఉద్యోగి తెలిపారు. క్వాల్‌కామ్‌ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ను అందించనుండగా.. మైక్రోసాఫ్ట్‌ కొన్ని యాప్‌లకు విండోస్‌ ఓస్‌తో మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ల్యాప్‌టాప్‌ ధరను రూ.15,000గా నిర్ణయించే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై రిలయన్స్‌ జియో ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. జియోబుక్‌ నవంబరులో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. తొలుత స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలకు అందించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల తర్వాత 5జీ వెర్షన్‌ను కూడా విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ ల్యాప్‌టాప్‌ తయారీని దేశీయ కంపెనీ ‘ఫ్లెక్స్‌’కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మార్చినాటికి వేల సంఖ్యలో విక్రయించాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. జియోబుక్‌ రాకతో భారత్‌లో ల్యాప్‌టాప్‌ విపణి 15 శాతం విస్తరిస్తుందని కౌంటర్‌పాయింట్‌ విశ్లేషకుడు ఒకరు తెలిపారు. ఈ ల్యాప్‌టాప్‌ కోసం ప్రత్యేకంగా జియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. జియోస్టోర్‌ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలుస్తోంది.

4జీ ధరలకే 5జీ సేవలు..

ప్రారంభించిన వెంటనే రిలయన్స్‌ జియో 5జీ ప్లాన్లకు అధిక ధరల్ని వసూలు చేసే అవకాశం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. తొలుత 4జీ ధరలకే 5జీ సేవల్ని అందిస్తామని ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. వినియోగదారులు దీనికి అలవాటు పడి.. 5జీ సేవల్లోని విలువను గుర్తించే వరకు కొత్త ధరలు అమలు చేసే యోచన లేదని పేర్కొన్నారు. దీపావళి కల్లా దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలో జియో 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని