Reliance Industries Ltd: విభజన తర్వాత లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు..!

విభజన అనంతరం కూడా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దూకుడును కొనసాగిస్తోంది. నేడు ఉదయం 10 గంటలకు తిరిగి మొదలు పెట్టగా.. దాదాపు 1శాతం పైగా లాభంలో ట్రేడవుతోంది. 

Published : 20 Jul 2023 10:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్‌ఐఎల్‌(Reliance Industries Ltd) తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్‌ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను (జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌-జేఎఫ్‌ఎస్‌ఎల్‌గా పేరు మారనుంది) విభజించింది. అనంతరం రిలయన్స్‌ షేరు ప్రీ ట్రేడింగ్‌ను ముగించుకొని రూ.2,580 వద్ద మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టింది. ప్రత్యేక ప్రీ- ఓపెన్‌ సెషన్‌ కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ట్రేడింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 10.11 సమయంలో షేరు ధర 1.22శాతం లాభంతో రూ.31.45 పెరిగి రూ.2,611.45 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో షేరు ధర అత్యధికంగా రూ.2,630 స్థాయికి చేరుకొంది. రిలయన్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో రూ.2,840 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.2,855 వద్ద తాజా 52 వారాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో రూ.2,841.85 వద్ద స్థిరపడింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి విభజించిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌( జేఎఫ్‌ఎస్‌ఎల్‌) షేరుకు స్థిర విలువను ఈ ప్రత్యేక ప్రీ-ఓపెన్‌ సెషన్‌ ద్వారా లెక్కించారు. ఈ సందర్భంగా రూ.261.85గా తేలింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ క్రితం రోజు ముగింపు విలువ.. ప్రత్యేక సెషన్‌లో వచ్చిన విలువ మధ్య వ్యత్యాసాన్ని ఈ స్థిర విలువగా నిర్థారించారు. 

సూక్ష్మ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ అన్ని రోజుల్లో

తొలుత జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరు స్థిర విలువ రూ.160-190 మధ్య ఉండేందుకు అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేశాయి. (నోమురా రూ.168; యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రూ.160; జేపీ మోర్గాన్‌ రూ.189; జెఫ్రీస్‌ రూ.179గా ఉండొచ్చని పేర్కొన్నాయి.) కానీ, అంచనాలను మించి ఈ షేరు విలువ కూడా రాణించింది. విభజన పథకం ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదార్లు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకు.. ఒక జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరును పొందుతారు. అంటే 100 ఆర్‌ఐఎల్‌ షేర్లకు 100 జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేర్లు లభిస్తాయి. జులై 20న రికార్డు తేదీగా నిర్ణయించినందున, అప్పటికి రిలయన్స్‌ షేర్లు కలిగి ఉన్న వాళ్లకే ఈ అవకాశం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను కలిగి ఉన్న వాటాదార్లు సుమారు 36 లక్షల మంది ఉంటారని అంచనా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని