Google: రూ.1337 కోట్ల జరిమానా.. గూగుల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ!

జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై స్టే విధించాలని కోరూతూ గూగుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జరిమానాలో 10శాతాన్ని వారం రోజుల్లోగా జమ చేయాలని సుప్రీం ఆదేశించింది.

Published : 19 Jan 2023 18:52 IST

దిల్లీ: అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్‌ (Google)కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT)  తీర్పును వ్యతిరేకిస్తూ గూగుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఆండ్రాయిడ్‌ (Android) ఉత్పత్తులకు సంబంధించి తన ఆధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందని, అనైతికంగా, పోటీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గతంలో రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. దీనిపై గూగుల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. అక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జరిమానాలో 10 శాతం మొత్తాన్ని నాలుగు వారాల్లోగా జమ చేయాలని ఆదేశించింది.

ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ.. గూగుల్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ జేబీ పార్దివాలా త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసును తిరిగి ఎన్‌సీఎల్‌ఏటీకి అప్పగించింది. మార్చి 31లోగా కేసును పూర్తి చేయాలని తెలిపింది. గతంలో సీసీఐ విధించిన అపరాధ రుసుములో 10శాతం చెల్లించేందుకు గూగుల్‌కు వారం రోజులు గడువిచ్చింది. మరోవైపు కేసు విచారణ కోసం గురువారం నుంచి 3 రోజుల్లోగా ఎన్‌సీఎల్‌ఏటీని సంప్రదించాలని గూగుల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సీసీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌ వెంకటరమణన్‌ గతంలో వాదనలు వినిపించారు. గూగుల్‌ సంస్థ ఐరోపా దేశాల్లో ఒక విధంగా, భారత్‌లో మరోలా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూరోపియన్‌ కమిషన్‌ ఆదేశాలను గూగుల్‌ పాటిస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని