IPO listing: ఐపీఓలపై సెబీ కీలక నిర్ణయం.. ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్‌

SEBI on IPO: ఐపీఓకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఓ లిస్టింగ్‌ సమయాన్ని మూడు రోజులకు తగ్గించింది.

Published : 09 Aug 2023 19:38 IST

దిల్లీ: ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (IPO) సంబంధించి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఓ లిస్టింగ్‌ సమయాన్ని కుదించింది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ తర్వాత ప్రస్తుతం 6 రోజులకు షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఆ సమయాన్ని మూడు రోజులకు సెబీ కుదించింది. ఈ మేరకు బుధవారం ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది.

సెప్టెంబర్‌ 1 తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అన్ని కంపెనీలూ ఈ విధానం పాటించాల్సి ఉంటుంది. అయితే, అది స్వచ్ఛందమే. డిసెంబర్‌ 1 తర్వాత పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే కంపెనీలు మాత్రం విధిగా మూడు రోజుల నిబంధన అనుసరించాల్సి ఉంటుంది. అంటే ఇకపై సబ్‌స్క్రిప్షన్‌ పూర్తయిన మూడు రోజులకే ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవ్వనున్నాయి. దీనివల్ల అటు కంపెనీలకు, ఇటు ఇన్వెసర్లకూ మేలు చేకూరుతుందని సెబీ తెలిపింది.

ఆన్‌లైన్‌లో రిఫండ్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోండిలా..

‘లిస్టింగ్‌ సమయాన్ని తగ్గించడం వల్ల సమీకరించిన మొత్తాన్ని కంపెనీలు తమ వ్యాపార అవసరాలకు వినియోగించడం వీలు పడుతుంది. అదే విధంగా ఇన్వెస్టర్లకు సైతం తమ పెట్టుబడులపై షేర్లను, లిక్విడిటీని త్వరితగతిన పొందేందుకు వీలు పడుతుంది. ప్రస్తుతం లిస్టింగ్‌ సమయాన్ని టి+6 అనుసరిస్తుండగా.. టి+3కి తగ్గిస్తున్నాం’’ అని సెబీ తెలిపింది. ఇక్కడ ‘టి’ అంటే సబ్‌స్క్రిప్షన్‌ క్లోజింగ్‌ డేట్‌గా పరిగణిస్తారు. ఐపీఓ లిస్టింగ్‌కు సంబంధించి సెబీ జూన్‌లో ప్రతిపాదించింది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాల స్వీకరణ అనంతరం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని