Oracle: ఒరాకిల్‌పై రూ.188 కోట్ల జరిమానా.. ఎందుకంటే?

టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ (Oracle)పై అమెరికా ‘సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (SEC)’ భారీ జరిమానా విధించింది....

Published : 28 Sep 2022 13:47 IST

వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ (Oracle)పై అమెరికా ‘సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (SEC)’ భారీ జరిమానా విధించింది. ‘విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టా (FCPA)న్ని’ ఉల్లంఘించినందుకుగానూ 23 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.188.35 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. భారత్‌, తుర్కియే, యూఏఈలో అధికారులకు లంచాలిచ్చేందుకుగానూ కంపెనీ ప్రత్యేకంగా నిధులను కేటాయించిందని ఎస్‌ఈసీ ఆరోపించింది.

భారత్‌లో 2016-2019 మధ్య ఒరాకిల్‌ ఇండియా ఉద్యోగులు రైల్వేశాఖ యాజమాన్యంలో ఓ రవాణా కంపెనీకి భారీ రాయితీ ఇచ్చినట్లు ఎస్‌ఈసీ ఆరోపించింది. ‘‘తీవ్ర పోటీ వల్ల ఒప్పందంలో పేర్కొన్న సాఫ్ట్‌వేర్‌ కాంపోనెంట్‌పై 70 శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని సేల్స్‌ ఉద్యోగులు ఒరాకిల్‌కు నివేదిక ఇచ్చారు. లేదంటే ఈ ఒప్పందం చేజారుతుందని పేర్కొన్నారు. అనుమతి కోసం ఫ్రాన్స్‌లోని కంపెనీ ఉన్నతోద్యోగికి లేఖ రాశారు. దానికి ఆయన ఎలాంటి ఆధారాలు అడగకుండానే అనుమతి ఇచ్చేశారు. కానీ, దీనికి భిన్నంగా ఒరాకిల్‌ ఇండియాకు ఎలాంటి పోటీ లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రోక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలిసింది. మరోవైపు ఓ ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించడానికి 67 వేల డాలర్లు అందుబాటులో ఉన్నట్లు ఒక సేల్స్‌ ఉద్యోగి ప్రత్యేకంగా నిర్వహించిన రికార్డు ఒకటి లభించింది. ఇలా మొత్తం 3,30,000 డాలర్లు అధికారులకు చెల్లించడానికి కేటాయించారు’’ అని ఎస్‌ఈసీ తన నివేదికలో ఆరోపించింది.

ఇలా ఒరాకిల్‌పై ఎస్‌ఈసీ జరిమానా విధించడం ఇది రెండోసారి. 2012లోనూ ఈ కంపెనీ 2 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించింది. అప్పుడు కూడా ఒరాకిల్‌ ఇండియాపై ఆరోపణలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని