Stock Market: ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి.. గరిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌

Stock Market: ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు మిశ్రమంగా ముగిశాయి. బడ్జెట్‌ ర్యాలీ చివరి వరకు నిలబడలేదు.

Updated : 01 Feb 2023 18:45 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బడ్జెట్‌పై ఆశలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు బడ్జెట్‌ ప్రసంగం ఆసాంతం ఆ జోరును కొనసాగించాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 1,200 పాయింట్లకు పైగా లాభపడింది. ఆదాయ పన్ను విధానంలో మార్పులు, మూలధన పెట్టుబడులకు కేటాయింపులు పెంచడం మదుపర్లను ఉత్సాహరించింది. కానీ, ఆ జోరు చివరి వరకు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు కిందకు దిగొచ్చాయి.

☛ ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 60,001.17 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,773.44- 58,816.84 మధ్య కదలాడింది. చివరకు 158.18 పాయింట్ల లాభంతో 59,708.08 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,811.60 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించి ఇంట్రాడేలో 17,972.20- 17,353.40 మధ్య ట్రేడయ్యింది. చివరకు 45.85 పాయింట్ల నష్టంతో 17,616.30 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.88 వద్ద నిలిచింది.

☛ సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో 16 షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో షేర్లు అధికంగా లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, టైటన్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని