Adani: అదానీకి యూపీ డిస్కమ్‌ షాక్‌.. రూ.5,400 కోట్ల స్మార్ట్‌మీటర్ల బిడ్‌ రద్దు

Adani group smart meter bid: స్మార్ట్‌మీటర్ల తయారీ కోసం అదానీ గ్రూప్‌ దాఖలు చేసిన బిడ్‌ను యూపీకి చెందిన డిస్కమ్‌ రద్దు చేసింది. అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

Updated : 06 Feb 2023 19:13 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యుత్‌ పంపిణీ సంస్థ మధ్యాంచల్‌ విద్యుత్‌ విత్రన్‌ నిగమ్‌ (MVVNL) అదానీ గ్రూప్‌నకు (Adani group) షాకిచ్చింది. 75 లక్షల స్మార్ట్‌ మీటర్ల (smart meters) అందించేందుకు ఉద్దేశించిన రూ.5,400 కోట్ల టెండర్‌ ప్రక్రియను రద్దు చేసింది. స్మార్ట్‌మీటర్ల కోసం అదానీ గ్రూప్‌ కనిష్ఠ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల టెండర్‌ను రద్దు చేసినట్లు డిస్కమ్‌ పేర్కొంది. తాజాగా మరోసారి బిడ్లను ఆహ్వానించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు విద్యుత్‌ పంపిణీ చేస్తున్న డిస్కమ్‌లు మొత్తం 2.5 కోట్ల స్మార్ట్‌మీటర్ల కోసం టెండర్లు ఆహ్వానించాయి. ఇందుకోసం అదానీ గ్రూప్‌ సహా జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ, ఇంటెల్లి స్మార్ట్‌ ఇన్‌ఫ్రా కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. అయితే, అన్ని కంపెనీల కంటే అదానీ గ్రూప్‌ తక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసింది. ఒక్కో స్మార్ట్‌ మీటర్‌ను రూ.10 వేలు చొప్పున అందించేందుకు సిద్ధమైంది. అయితే, ఒక్కో స్మార్ట్‌మీటర్‌ను రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (REC) రూ.6వేలుగా పేర్కొంది. దీంతో పోలిస్తే అదానీ గ్రూప్‌ దాఖలు చేసిన మొత్తం చాలా అధికమని పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ఎంవీవీఎన్‌ఎల్‌ స్మార్ట్‌మీటర్ల టెండర్‌ను రద్దు చేసింది. అయితే, బిడ్లు దాఖలు చేసిన నాలుగు కంపెనీలకూ ఇప్పటివరకు స్మార్ట్‌మీటర్లు తయారు చేసిన అనుభవం లేకపోవడం గమనార్హం. మిగిలిన డిస్కమ్‌లు సైతం ఇదే బాటను అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్మార్ట్‌మీటర్ల టెండర్‌పై యూపీ విద్యుత్‌ వినియోగదారుల ఫోరం మండిపడుతోంది. దొడ్డిదారిన విద్యుత్‌ సంస్థలను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అని ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని