2026-27 నాటికి రోజుకి 100 కోట్ల UPI లావాదేవీలు: PwC నివేదిక

2026- 27 నాటికి యూపీఐ లావాదేవీలు గణనీయంగా పుంజుకుంటాయని పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. అదే సమయంలో క్రెడిట్‌ కార్డు చెల్లింపుల్లోనూ మంచి వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.

Published : 28 May 2023 17:50 IST

దిల్లీ: దేశంలో యూపీఐ లావాదేవీలు (UPI Transactions) క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. 2026- 27 నాటికి రోజుకి 100 కోట్ల లావాదేవీలు జరుగుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో ఇది 90 శాతానికి సమానమని తెలిపింది.

యూపీఐతో భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకున్నాయి. 2022- 23లో రిటైల్‌ విభాగంలో 75 శాతం చెల్లింపులు యూపీఐ (UPI Transactions) ద్వారానే జరిగాయని పీడబ్ల్యూసీ తెలిపింది. 2022- 23లో మొత్తం 103 బిలియన్ల డిజిటల్‌ లావాదేవీలు జరగ్గా.. అందులో 83.71 బిలియన్లు యూపీఐ (UPI Transactions) ద్వారానే జరిగాయని పేర్కొంది. 2026- 27 నాటికి డిజిటల్‌ లావాదేవీల సంఖ్య 411 బిలియన్లకు చేరుతుందని.. అందులో 379 బిలియన్లు యూపీఐ ద్వారా జరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీల్లో (UPI Transactions) ఏటా 50 శాతం చొప్పున వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

యూపీఐ (UPI Transactions) తర్వాత డిజిటల్‌ చెల్లింపుల కోసం అత్యధిక మంది డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నట్లు పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డు చెల్లింపుల్లో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదవుతున్నట్లు పేర్కొంది. 2024- 25 నాటికి డెబిట్‌ కంటే క్రెడిట్‌ కార్డు ద్వారా జరిగే చెల్లింపులే అధికంగా ఉంటాయని అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో క్రెడిట్‌ కార్డుల జారీలో ఏటా 21 శాతం వృద్ధి నమోదవుతుందని తెలిపింది. అదే సమయంలో డెబిట్‌ కార్డుల జారీ 3 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని తెలిపింది. యూపీఐ (UPI Transactions) ద్వారా చెల్లింపులు సులభమవడం వల్లే డెబిట్‌ కార్డు వినియోగం తగ్గిపోతోందని పేర్కొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు