నిన్న ‘అదానీ’పై.. నేడు వేదాంతపై.. OCCRP తీవ్ర ఆరోపణలు!

Vedanta: సొంత షేర్లలో అదానీ కుటుంబం అజ్ఞాత పెట్టుబడులు పెట్టి భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపించిన ఓసీసీఆర్‌పీ... తాజాగా వేదాంతపై తీవ్ర ఆరోపణలు చేసింది.  

Updated : 01 Sep 2023 12:23 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌’ (OCCRP).. తాజాగా మరో భారత కంపెనీపైనా విరుచుకుపడింది. ఈసారి మైనింగ్‌ దిగ్గజం వేదాంత (Vedanta)ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పించింది. కరోనా విజృంభిస్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకొని వేదాంత (Vedanta) రహస్యంగా నిబంధనలకు తూట్లు పొడిచేందుకు యత్నించినట్లు పేర్కొంది. మహమ్మారి మాటున పర్యావరణ నిబంధనలను సడలించేలా రహస్య లాబీయింగ్‌ నిర్వహించినట్లు ఆరోపించింది.

వేదాంత (Vedanta) ప్రతిపాదించిన మార్పులను భారత ప్రభుత్వం ఆమోదించినట్లు ఓసీసీఆర్‌పీ (OCCRP) ఎలాంటి ఆధారాలను బయటపెట్టకుండానే ఆరోపించింది. అక్రమ పద్ధతుల ద్వారా వాటిని అమలు కూడా చేసినట్లు తెలిపింది. కొత్తగా ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని 50 శాతం పెంచుకునేలా వేదాంత రహస్యంగా లాబీయింగ్‌ నడిపినట్లు పేర్కొంది.

సొంత షేర్లలో అదానీ కుటుంబం అజ్ఞాత పెట్టుబడులు

మరోవైపు వేదాంత (Vedanta) చమురు వ్యాపారం కెయిర్న్ ఇండియా.. ప్రభుత్వ వేలంలో పొందిన చమురు బ్లాక్‌లలో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం పబ్లిక్ హియరింగ్‌లను రద్దు చేయడానికి విజయవంతంగా లాబీయింగ్ చేసినట్లు ఓసీసీఆర్‌పీ (OCCRP) ఆరోపించింది. అప్పటి నుంచి స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ.. రాజస్థాన్‌లో ఆరు వివాదాస్పద ఆయిల్‌ ప్రాజెక్టులు కెయిర్న్‌కు లభించినట్లు పేర్కొంది. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు వేదాంత అధికారికంగా స్పందించలేదు.

2013 నుంచి 2018 వరకు అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువలను గణనీయంగా పెంచారని ఓసీసీఆర్‌పీ గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకోసం మారిషస్‌కు చెందిన ‘అజ్ఞాత’ పెట్టుబడి సంస్థలను ఉపయోగించి అదానీ సంబంధీకులు రహస్యంగా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఓసీసీఆర్‌పీ తెలిపింది. అయితే వీటిని అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. జార్జ్‌ సోరోస్‌ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్‌లు విదేశీ మీడియాలోని ఓ విభాగం మద్దతుతో చేసిన మరో కుట్రగా దీనిని అభివర్ణించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు