సొంత షేర్లలో అదానీ కుటుంబం అజ్ఞాత పెట్టుబడులు

అదానీ గ్రూపునకు మళ్లీ ఆరోపణల సెగ తాకింది. ప్రమోటరు కుటుంబానికి చెందిన సంబంధీకులపై ఈ కొత్త ఆరోపణలు వచ్చాయి.

Updated : 01 Sep 2023 07:01 IST

2013- 2018 మధ్య షేర్ల విలువలు పెంచేందుకే
ఓసీసీఆర్‌పీ ఆరోపణలు
తీవ్రంగా ఖండించిన గ్రూప్‌

దిల్లీ: అదానీ గ్రూపునకు మళ్లీ ఆరోపణల సెగ తాకింది. ప్రమోటరు కుటుంబానికి చెందిన సంబంధీకులపై ఈ కొత్త ఆరోపణలు వచ్చాయి. 2013 నుంచి 2018 వరకు అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువలను గణనీయంగా పెంచేందుకు మారిషస్‌కు చెందిన ‘అజ్ఞాత’ పెట్టుబడి సంస్థలను ఉపయోగించి వీళ్లు రహస్యంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్‌పీ) ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది.

ప్రమోటరు కుటుంబ భాగస్వాములు నిర్వహిస్తున్న మారిషస్‌కు చెందిన రెండు పెట్టుబడి ఫండ్‌లు ఈ రహస్య పెట్టుబడుల ప్రక్రియను నిర్వహించాయంటూ తనకు లభించిన పత్రాల్లోని వివరాలను ఉటంకిస్తూ ఓసీసీఆర్‌పీ వెల్లడించింది. 2013- 2018 సమయంలో అదానీ గ్రూపులోని నమోదిత కంపెనీల షేర్లు గణనీయంగా పెరగడంతో పాటు అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిన సంగతి తెలిసిందే. మారిషస్‌ ఆధారిత ఫండ్‌లు నిర్వహించిన ఈ పెట్టుబడుల ప్రక్రియ వల్ల అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సోదరుడైన వినోద్‌ అదానీకు సన్నిహితులైన ఇద్దరు బాగా లబ్ధి పొందినట్లు ఓసీసీఆర్‌పీ పేర్కొంది.

వీరిద్దరూ కీలకం..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన నాజర్‌ అలీ షాబాన్‌ అహ్లి, తైవాన్‌కు చెందిన ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌లు కొన్ని సంవత్సరాల పాటు రెండు మారిషస్‌ ఫండ్‌లను ఉపయోగించి అదానీ గ్రూపు షేర్లలో భారీ ట్రేడింగ్‌ నిర్వహించారు. వినోద్‌ అదానీకి సన్నిహిత ఉద్యోగికి చెందిన దుబాయ్‌ కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ ఈ రెండు ఫండ్‌లను పర్యవేక్షించేది. అదానీ గ్రూపు స్టాక్‌ మార్కెట్‌లో అనుమానిత ట్రేడింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోందంటూ 2014 ప్రారంభంలో సెబీ ఓ ఆధార పత్రాన్ని బహిర్గతపర్చిన విషయాన్ని కూడా ఓసీసీఆర్‌పీ గుర్తుచేసింది. 2014లో సెబీకి ఛైర్మన్‌గా ఉన్న యు.కె.సిన్హా.. ప్రస్తుతం అదానీకి చెందిన వార్తా సంస్థల బ్రాడ్‌కాస్టర్‌ ఎన్‌డీటీవీకి డైరెక్టరు, మేనేజింగ్‌ డైరెక్టరుగా ఉన్నారు.

ఇవీ ప్రధాన ఆరోపణలు..

  • ఛాంగ్‌, అహ్లిలు పెట్టిన పెట్టుబడుల ద్వారా షేర్లలో అవకతవకలకు పాల్పడ్డారా అనే సందేహాలు కల్గుతున్నాయి. అలాగే వాళ్ల నియంత్రణలోని ఫండ్‌లను ప్రమోటరు గ్రూపుగా వర్గీకరించారా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఇవ్వన్నీ నమోదు నిబంధనల ఉల్లంఘనలకు దారి తీసేవే.
  • ఒకవేళ అహ్లి, ఛాంగ్‌లు అదానీ ప్రమోటర్లు తరపున వ్యవహరించారని భావిస్తే.. అదానీ గ్రూపులోని వారి వాటాలను కలిపితే మొత్తంగా ఇన్‌సైడర్‌లకే 75 శాతానికి పైగా వాటా ఉన్నట్లు అవుతుంది. ఇది భారత లిస్టింగ్‌ చట్టంలోని నిబంధనలకు విరుద్ధం.
  • వినోద్‌ అదానీని అదానీ గ్రూపు ఇటీవలే ప్రమోటరుగా గుర్తించింది. అందువల్ల ఆయన నియంత్రణలోని వాటాలు కూడా ప్రమోటర్‌ గ్రూపు పెట్టుబడులుగా వర్గీకరించాల్సి ఉంటుంది.
  • చాంగ్‌, అహ్లిలు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన నిధులు అదానీ కుటుంబం నుంచి వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాల్లేవు. అయితే అదానీ కుటుంబం సమన్వయంతోనే అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో వాళ్లు ట్రేడింగ్‌ నిర్వహించినట్లుగా ఆధారాలు ఉన్నట్లు మా దర్యాప్తులో వెల్లడైందని ఓసీసీఆర్‌పీ పేర్కొంది.

అవి హిండెన్‌బర్గ్‌ అసత్య ఆరోపణల్లాంటివే: అదానీ గ్రూపు

ఓసీసీఆర్‌పీ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. జార్జ్‌ సోరోస్‌ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్‌లు విదేశీ మీడియాలోని ఓ విభాగం మద్దతుతో చేసిన మరో కుట్రగా దీనిని అభివర్ణించింది. దశాబ్దక్రితం ముగిసిపోయిన కేసుల ఆధారంగా చేసిన ఆరోపణలు అని వీటిని తెలిపింది. ఓవర్‌ వ్యాల్యూయేషన్‌ జరగలేదని, లావాదేవీలన్నీ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని ఇప్పటికే తమకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని గుర్తు చేసింది. ఓవర్‌ వ్యాల్యూయేషన్‌ జరగలేదని తేలినప్పుడు.. నిధుల బదిలీ ఆరోపణలకు యోగ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించింది. పైగా ఓసీసీఆర్‌పీ చేసిన ఆరోపణలు హిండెన్‌బర్గ్‌ నివేదికకు మారురూపంగా కనిపిస్తున్నాయని తెలిపింది. అందువల్ల వీటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

అదానీ షేర్లు కుదేల్‌: ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఓసీసీఆర్‌పీ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు కుదేలయ్యాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 4.39%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 3.77%, అంబుజా సిమెంట్స్‌ 3.53%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 3.52%, అదానీ పోర్ట్స్‌ 3.37%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 2.59%, అదానీ విల్మర్‌ 2.56%, అదానీ పవర్‌ 2.24%, ఎన్‌డీటీవీ 2.21% చొప్పున నష్టాలు నమోదుచేశాయి. ఏసీసీ మాత్రమే 0.47% పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని