chatGPT: చాట్‌జీపీటీని మీరూ క్రియేట్‌ చేయొచ్చు.. దానితో డబ్బులూ సంపాదించొచ్చు!

chatGPT: ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు ఓ చాట్‌జీపీటీని సృష్టించుకోవచ్చని ఓపెన్‌ ఏఐ తెలిపింది. దీంతో పాటు మరికొన్ని చాట్‌జీపీటీ అప్‌డేట్లనూ అందించింది.

Published : 07 Nov 2023 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్నాలజీ రంగలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరతీసిన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (chatGPT) విడుదలై ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా దీన్ని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. రాబోయే రోజుల్లో రానున్న పలు ఆసక్తికర అప్‌డేట్లను వెల్లడించింది. త్వరలో ఎవరికివారు తమ అవసరాలకు అనుగుణంగా ఒక ఏఐ చాట్‌బాట్‌ను నిర్మించుకునే వెసులుబాటును తీసుకురానున్నట్లు ప్రకటించింది. పైగా దీన్ని ఇతరులు కూడా ఉపయోగించుకునేందుకు అనుమతించి డబ్బులు సంపాదించుకునే అవకాశాన్నీ కల్పించనున్నట్లు వెల్లడించింది.

కస్టమ్‌ జీపీటీ..

ఎవరికి వారు వారి సొంతంగా సృష్టించుకునే ఈ చాట్‌బాట్‌లను కస్టమ్‌ చాట్‌జీపీటీలు (Custom chatGPT)గా ఓపెన్‌ఏఐ వ్యవహరిస్తోంది. వీటినే జీపీటీ (GPT)లుగానూ పిలుస్తోంది. వీటిని ఎవరైనా నిర్మించుకోవచ్చని తెలిపింది. ఎలాంటి కోడింగ్‌ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. కస్టమ్‌ చాట్‌జీపీటీలను క్రియేట్‌ చేయడం ఇతరులతో సంభాషణలు ప్రారంభించడమంత సులభమని చెప్పింది. ఎలాంటి పనులు చేయాలో ఆదేశాలు ఇచ్చి, వాటిని నిర్వహించేందుకు కావాల్సిన సమాచారాన్ని అందజేస్తే సరిపోతుందని వివరించింది. వెబ్‌ సెర్చ్‌ చేయడం, ఇమేజ్‌లను క్రియేట్‌ చేయడం, డేటాను విశ్లేషించడం ఇలా చాలా పనులకు కస్టమ్‌ చాట్‌జీపీటీ (Custom chatGPT)లను సృష్టించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఈ వెసులుబాటును చాట్‌జీపీటీ ప్లస్‌, ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. త్వరలో మరింత మంది యూజర్లకు అందించనున్నట్లు తెలిపింది.

యాప్‌స్టోర్‌ తరహాలో జీపీటీ స్టోర్‌..

ఒకరు క్రియేట్‌ చేసిన జీపీటీని మరొకరు వాడుకునేలా ఒక స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. వీటిలో వెరిఫైడ్‌ క్రియేటర్లు అభివృద్ధి చేసిన జీపీటీలను అందుబాటులో ఉంచుతామని కంపెనీ తెలిపింది. అవసరాలకు అనుగుణంగా వాటిని ఇతరులు డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకోవచ్చని తెలిపింది. పైగా యూజర్ల సమీక్షను బట్టి వాటికి ర్యాంకింగ్‌ కూడా ఇస్తామని వెల్లడించింది. అలాగే వాడుతున్న యూజర్ల సంఖ్యను బట్టి సంపాదన ఉంటుందని వివరించింది.

మరింత శక్తిమంతమైన జీపీటీ-4..

కస్టమ్‌ చాట్‌బాట్‌లతో పాటు మరిన్ని అప్‌డేట్లనూ ఓపెన్‌ఏఐ ప్రకటించింది. జీపీటీ-4 (GPT-4)కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ జీపీటీ-4 టర్బో (GPT-4 Turbo)ను తీసుకొచ్చింది. ఇది మరింత సమర్థంగా, శక్తిమంతంగా పనిచేస్తుందని తెలిపింది. పైగా 2023 ఏప్రిల్‌ వరకు ఉన్న సమాచారాన్నీ ఆధారంగా చేసుకొని సమాధానాలు ఇస్తుందని పేర్కొంది. అలాగే తక్కువ ధరకే దీన్ని యూజర్లకు అందించనున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని