
హత్యకు కారణమైన లౌడ్మ్యూజిక్
న్యూదిల్లీ: ఎక్కువ శబ్దం వినిపించేలా పెట్టిన మ్యూజిక్ గొడవకు దారితీసి ఒకరి హత్యకు కారణమైన ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దిల్లీలోని భథోలా ప్రాంతంలో నివాసముండే అన్నదమ్ములు సుశీల్, సునీల్, అనీల్ తమ ఇంటి పక్కన ఉండే సత్తార్ అనే వ్యక్తి లౌడ్మ్యూజిక్ విషయమై అతనితో వాగ్వాదానికి దిగారు. సౌండ్ తగ్గించమని చెప్పినా సత్తార్ నిరాకరించడంతో గొడవ పెద్దదైంది. కత్తులతో దాడి చేసుకునే వరకూ వచ్చింది. ఈ ఘర్షణలో సత్తార్ అతని ఇద్దరి కొడుకులను సుశీల్, సునీల్, అనీల్‌ను పలుమార్లు కత్తితో పొడిచారు.
తీవ్రంగా గాయపడిన ఈ ముగ్గురిని కుటుంబ సభ్యులు దిల్లీలోని బాబు జగ్జీవన్‌రామ్ ఆసుప్రతికి తీసుకెళ్లారు. వీరిలో సుశీల్ మార్గం మధ్యలోనే మృతిచెందారు. అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ గొడవలో సత్తార్ భార్య షాజహాన్ సైతం గాయపడ్డారు.
బాధితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సత్తార్‌తో పాటు అతని ఇద్దరు కొడుకులను అరెస్టు చేశారు. దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాన్ని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బుధవారం పరామర్శించారు. న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.