HDFC ఏటీఎం చోరీ కేసు: జరిగింది ఇది..!

నగరంలోని కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 29న ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపిన

Published : 13 May 2021 01:40 IST

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి ఏటీఎం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6.31లక్షల నగదు, నాటు తుపాకీ, ఒక ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్‌ 29న ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపిన నిందితులు రూ.5లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు.

‘‘కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేశాం. నిందితుల నుంచి రూ.6.31లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. బిహార్‌కు చెందిన అజిత్‌కుమార్‌, ముఖేశ్‌ ఈ ఘటనకు పాల్పడ్డారు. వీరిలో అజిత్‌ దుండిగల్‌లోని ఓ ప్యాకేజ్‌ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిస అయిన అజిత్‌ సులభంగా డబ్బు సంపాదించేందుకు దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2018లో దుండిగల్‌లో ఒక మనీ ట్రాన్స్‌ఫర్‌ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ పనిచేస్తున్న మహిళను బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేయగా.. ఆమె అరవడంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పోలీసులకు చిక్కాడు. కొన్నాళ్లు జైలులో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతూరు వెళ్లిపోయాడు. గతేడాది మళ్లీ నగరానికి వచ్చి కొన్నాళ్లు ప్యాకేజ్‌ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్‌గా పనిచేయడం మొదలు పెట్టాడు. డబ్బు మీద ఆశతో మళ్లీ దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో స్నేహితుడు ముఖేశ్‌కు రూ.30వేలు పంపి నాటు తుపాకీ తీసుకురమ్మని చెప్పాడు. ముఖేశ్ ఇక్కడకు వచ్చిన తర్వాత తుపాకీని చెక్‌ చేసేందుకు గండిమైసమ్మ సమీపంలోని అడవికి వెళ్లి ఒక రౌండ్‌ ఫైర్‌ చేసి చూశాడు’’

‘‘ఏప్రిల్‌ 16న అజిత్‌, ముఖేశ్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ వ్యక్తి వద్ద ఉన్న రూ.1.96లక్షలు, ఐఫోన్‌ తీసుకుని పారిపోయారు. ఏప్రిల్‌ 24న దుండిగల్‌ వద్ద నిలిపి ఉంచిన బైక్‌ను దొంగిలించారు. అది వేగంగా వెళ్లడం లేదని, 220సీసీ పల్సర్‌ను దొంగిలించారు. అదే బండిని ఏటీఎం చోరీలో వాడారు. ఏప్రిల్‌ 29న ఎర్రగడ్డ వద్దకు చేరకున్న వీరిద్దరికీ ఏటీఎంలో డబ్బులు నింపే వాహనం కనిపించింది. దాన్ని ఫాలో చేశారు. కూకట్‌పల్లిలోని ఓ హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు నింపిన తర్వాత ఆ వాహనం పటేల్‌కుంట పార్కు వద్ద ఉన్న మరో ఏటీఎం వద్దకు చేరుకుంది. అక్కడే నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. ముందుగా అజిత్‌కుమార్‌ అక్కడి సెక్యురిటీ గార్డ్‌కు తుపాకీ చూపించి బెదిరించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్‌ అజిత్‌ చేతిలోని తుపాకీని లాక్కొనేందుకు యత్నించగా అతను కాల్పులు జరిపాడు. ఏటీఎం నిర్వహణ ఉద్యోగులు శ్రీనివాస్‌, నవీన్‌ వెంటనే స్పందించి ధైర్యంగా నిందితులను పట్టుకునేందుకు యత్నించారు. అజిత్‌ మరో రౌండ్‌ కాల్పులు జరపడంతో శ్రీనివాస్‌ కాలికి గాయమైంది. వెంటనే ముఖేశ్‌ ఏటీఎం వద్ద ఉన్న రూ.5లక్షలను పట్టుకు రాగా, ఇద్దరూ బైక్‌పై అక్కడి నుంచి ఉడాయించారు’’ అని సజ్జనార్‌ తెలిపారు. ఏటీఎం దొంగలను అడ్డుకునేందుకు ధైర్యం ప్రదర్శించిన శ్రీనివాస్, నవీన్‌ను సీపీ ఈ సందర్భంగా ప్రశంసించారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా వెంటనే స్పందించి ఉంటే నిందితులు అప్పుడే దొరికిపోయేవారన్నారు. అయితే, నిందితుల చేతిలో తుపాకీ ఉండటం, అప్పటికే సెక్యూరిటీ గార్డ్‌, శ్రీనివాస్‌పై కాల్పులు జరపడంతో జనాలు భయపడ్డారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని