POCSO Court: బాలికపై అత్యాచారం.. తండ్రితో సహా మేనమామకు 84 ఏళ్ల జైలు శిక్ష!

అయిదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తండ్రితోపాటు మరో వ్యక్తికి 84 ఏళ్ల జైలు శిక్ష పడింది. కేరళ (Kerala)లోని పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Published : 19 May 2023 01:42 IST

తిరువనంతపురం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం ఆమె తండ్రితో సహా మేనమామకు కఠిన శిక్ష విధించింది. ఇద్దరికి 84 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కేరళ (Kerala)లోని పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు (POCSO Court) ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, వివిధ సెక్షన్ల కింద ఇచ్చిన ఈ శిక్షలన్నింటినీ ఒకేసారి అనుభవించాలని ఆదేశించింది. దీంతో దోషులు మొత్తంగా 20 ఏళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ఇక్కడి దేవీకులం పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.. పోక్సో చట్టంతోపాటు ఐపీసీ, జువెనైల్‌ జస్టిస్‌ యాక్టు ప్రకారం ఇద్దరు దోషులకు మొత్తం 84 ఏళ్ల శిక్ష విధించింది. అయితే, అందులో గరిష్ఠ శిక్ష 20 ఏళ్లు ఉన్నందున వారు వాటన్నింటినీ ఒకేసారి అనుభవించాలని ఆదేశించింది. జైలు శిక్షతోపాటు ఇద్దరు దోషులకు చెరో రూ.3లక్షల చొప్పున జరిమానా పడింది. వసూలు చేసిన అనంతరం ఆ మొత్తాన్ని బాధితురాలికి అందించాలని న్యాయమూర్తి రవిచందర్‌ సీఆర్‌ వెల్లడించారు. దీంతోపాటు జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని కూడా బాధితురాలికి పరిహారం అందించాలని ఆదేశించారు.

కేరళలోని దేవీకులానికి చెందిన ఓ వ్యక్తి.. ఐదేళ్ల కూతురిపై 2021లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆయనతోపాటు చిన్నారికి మామ వరసయ్యే వ్యక్తి కూడా ఈ దారుణానికి తెగబడ్డాడు. 2021 డిసెంబర్‌ 24న చిన్నారి తల్లి ఈ దారుణాన్ని చూసింది. వెంటనే ఈ విషయాన్ని శిశుసంక్షేమ కమిటీకి తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 18 మంది సాక్షులను విచారించిన పోలీసులు.. మరుసటి ఏడాది ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.. చిన్నారి తండ్రితో సహా మేనమామను దోషులుగా తేలుస్తూ శిక్ష ఖరారు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని