ఉత్తర్‌ ప్రదేశ్‌లో పదవుల రాకెట్‌

పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతుల రాకెట్‌ వర్ధిల్లుతోందని ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌కు సంచలనాత్మక లేఖ రాశారు.

Updated : 03 Jan 2020 04:29 IST

పోలీసు శాఖలో పదోన్నతుల రాకెట్‌ 
యోగికి పోలీసు ఉన్నతాధికారి లేఖ

నొయిడా (ఉత్తర్ ప్రదేశ్‌): రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతుల రాకెట్‌ రాజ్యమేలుతోందని ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు సంచలనాత్మక లేఖ రాశారు. పదవిని, ప్రదేశాన్ని బట్టి భారీ మొత్తాలు చేతులు మారుతాయని నొయిడా సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) వైభవ్‌ కృష్ణ తన లేఖలో వివరించారు. జిల్లా పోలీసు అధికారులుగా కాసులు కురిసే చోట పదవులు పొందటానికి గాను ఈ మొత్తాలను చెల్లిస్తారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న  ఐదుగురు యూపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను ఆయన తన లేఖలో ప్రస్తావించారు.
డీజీపీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు రాసిన ఈ రహస్య లేఖలో ఆ అయిదుగురు అధికారుల వివరాలతో పాటు మీరట్‌ ఎస్‌ఎస్‌పీ పదవికి గానూ ఒక ఐపీఎస్‌ అధికారి, బ్రోకర్ల మధ్య రూ.80 లక్షలకు ఒప్పందం కుదిరినట్టు తెలిపే ఫోన్‌కాల్‌ రికార్డింగులను వాట్సాప్‌ సంభాషణలను గురించి వైభవ్‌ కృష్ణ వివరించారు. అంతేకాకుండా ఆగ్రా ఎస్‌ఎస్‌పీ పదవికి రూ. 50 లక్షలు, బరేలీ ఎస్‌ఎస్‌పీకి అయితే రూ. 40 లక్షలు ఆదే విధంగా బిజ్నోర్‌ ఎస్పీ పదవి ఖరీదు రూ.30 లక్షలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అత్యంత పకడ్బందీగా ఏర్పాటైన ఒక సిండికేట్‌ ఈ రాకెట్‌ను నడుపుతోందని వైభవ్‌ వెల్లడించారు.

ఈ రాకెట్ వివరాలను బయట పెట్టినందుకు ఆ ముఠా సభ్యులు తనను టార్గెట్‌ చేస్తున్నరని కూడా నొయిడా ఎస్‌ఎస్‌పీ చెప్పారు. ఇక ఉత్తర్‌ ప్రదేశ్‌ డీజీపీ ఓ.పీ. సింగ్‌ ఆ లేఖ విషయంలో వివరాలు వెల్లడించలేదు. కాగా స్వతంత్ర, స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారణ జరిగేందుకు ఆ బాధ్యతను నొయిడా పోలీసులకు బదులుగా హాపుర్‌ పోలీసు అధికారులకు అప్పగిస్తున్నాము అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని