Updated : 07 May 2020 15:03 IST

విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం

విశాఖ: నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఇప్పటి వరకు 9మంది మృతి చెందినట్లు సమాచారం. ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ముగ్గురు, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఐదుగురు, కొత్తవలస ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 25 అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. సింహాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు.  ఇవాళ తెల్లవారుజామున ఆర్.ఆర్‌.వెంకటాపురం నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌కు డ్యూటీ నిమిత్తం వచ్చిన ఓ కానిస్టేబుల్‌ సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా, ఎమ్మెల్యే గణబాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్‌.ఆర్‌. వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు. లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

200 మంది అస్వస్థతకు గురయ్యారు: కలెక్టర్‌
‘‘ఎల్‌.జీ పాలిమర్స్‌ సౌత్‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. సుమారు 3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టైరీన్‌ వాయువు లీకైంది. 4.30గంటలకు  మాకు సమాచారం అందింది. లీకైన గ్యాస్‌ వల్ల ప్రాణ నష్టం ఉండదు. స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్‌ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు.  వారికి ఆక్సిజన్‌ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 200 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని అంచనా వేస్తున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను ఈ ప్రాంతం నుంచి కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే వెంటనే రికవరీ అవుతారు.  మరో రెండు గంటల్లో  పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం’’ అని జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని