మరో ముగ్గురికీ డ్రగ్స్‌ సెగ

మాదకద్రవ్యాల కేసు మరో ముగ్గురి మెడకూ చుట్టుకుంది. నటుడు, వ్యాఖ్యాత అకుల్‌ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.వి.దేవరాజ్‌ తనయుడు ఆర్‌.వి.యువరాజ్‌, కొన్ని కన్నడ చిత్రాల్లో

Published : 19 Sep 2020 07:00 IST

● మత్తు పొగ’కు కారణమేంటి?

బెంగళూరు (మల్లేశ్వరం) : మాదకద్రవ్యాల కేసు మరో ముగ్గురి మెడకూ చుట్టుకుంది. నటుడు, వ్యాఖ్యాత అకుల్‌ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.వి.దేవరాజ్‌ తనయుడు ఆర్‌.వి.యువరాజ్‌, కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన కథానాయకుడు సంతోశ్‌కుమార్‌లకు సీసీబీ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం పది గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌లో ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు మరికొంత గడువు కావాలని అకుల్‌ బాలాజీ కోరారు. విమానంలో రావాలని అధికారులు చేసిన సూచనలతో, ఆయన నేడు నగరానికి రానున్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, వ్యాఖ్యాతగా వ్యవహరించిన పలు తెలుగు, కన్నడ కార్యక్రమాల్లో నటీనటులు పాల్గొంటున్న నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసి ఉంటారని ఆయన పేర్కొన్నారు.

అకుల్‌ బాలాజీ

తన కుమారునికి ఎటువంటి చెడు వ్యసనాలు లేవని ఆర్‌.వి.దేవరాజ్‌ స్పష్టం చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురితో అతనికి ఉన్న పరిచయాలతో పోలీసులు విచారణకు పిలిచి ఉంటారని, విచారణకు యువరాజ్‌ హాజరవుతాడని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశామని సీసీబీ జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు తీవ్రమైందని చెప్పారు. డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు ఉన్నా, వారిని రక్షించే ప్రయత్నాలు తాము చేయబోమని పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ స్పష్టం చేశారు.

ఆర్‌.వి.యువరాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని