ఊపిరి పోసే ఔషధంతోనే ఉసురు తీస్తున్నారు..

మనిషి ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే ఇంజక్షన్లను హత్యలకు ఆయుధంగా ఉపయోగిస్తున్న ఘటనలు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఊపిరి పోయాల్సిన రంగంలో పనిచేస్తున్న వ్యక్తులే ఉసురు తీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం

Updated : 23 Sep 2022 05:27 IST

జమాల్‌సాహెబ్‌, నవీన హత్య కేసుల్లో సూదిమందు వినియోగం
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

నిషి ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే ఇంజక్షన్లను హత్యలకు ఆయుధంగా ఉపయోగిస్తున్న ఘటనలు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఊపిరి పోయాల్సిన రంగంలో పనిచేస్తున్న వ్యక్తులే ఉసురు తీస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళ్తున్న జమాల్‌ సాహెబ్‌ను లిఫ్ట్‌ అడిగి సూది గుచ్చి హత్య చేసిన సంఘటన నుంచి జిల్లా వాసులు తేరుకోకముందే బాలింత నవీన హత్య ఉదంతం ఉలిక్కిపడేలా చేసింది. బిడ్డను ప్రసవించిన రోజే బాలింత భర్త కర్కశంగా కడతేర్చిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ మత్తుమందునే హత్యాయుధంగా వినియోగించినట్టు పోలీసుల విచారణలో తేల్చారు.

వైద్య రంగంతో సంబంధం ఉండటం వల్లే..
రెండు హత్యలకు వేర్వేరు రకాలైన మత్తు ఇంజక్షన్లను వాడారు. రోగులకు శస్త్రచికిత్స సమయంలో మత్తుమందు వైద్యనిపుణులు మాత్రమే వాటిని వినియోగిస్తారు. అసలు ఇలాంటి సూదిమందులు నిందితులకు ఎలా వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని ఔషధ దుకాణాల్లో విక్రయించడానికి అనుమతులు ఉండవు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ లభించే అవకాశం లేదు. ఆపరేషన్‌ థియేటర్స్‌, ఐసీయూ విభాగాలు ఉన్న ఆస్పత్రుల్లో నిర్వహించే అనుబంధ ఔషధ దుకాణాల్లో మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉంటాయి. అవికూడా వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే ఇస్తారు. చికిత్స సమయంలో మత్తు వైద్య నిపుణులు(అనస్తీషియా) ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తారు. ఇలాంటి ఇంజక్షన్లను ఎక్కువ మోతాదులో మానవ శరీరంలోకి పంపిస్తే స్వల్ప వ్యవధిలో అవయవాలు దెబ్బతిని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న రెండూ హత్యలూ ఇలాగే జరిగాయి. నిందితులు వైద్య రంగంలో పనిచేస్తున్న వారు కావడంతోనే ఔషధాలను రహస్యంగా సేకరించినట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడి నుంచి తెప్పించారనేదానిపై విచారణ చేపట్టాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా అధికార యంత్రాగం అప్రమత్తం కావాలి. ఔషధ దుకాణాలపై నిఘా పెంచాలి.


ప్రైవేటు వ్యక్తులకు మత్తు ఇంజక్షన్లు విక్రయించే అవకాశం లేదు. అర్హత కలిగిన వైద్యులు, మత్తు వైద్యనిపుణుల ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే విక్రయించాలి. వీటి విక్రయానికి అనుమతుల్లేని ఔషధ దుకాణాల్లో విక్రయిస్తే లైసెన్సు రద్దు చేసి కేసులు పెడతాం. అనైతిక చర్యలకు వినియోగించేందుకు సహకరించిన వ్యక్తులపైనా కఠిన చర్యలు తీసుకోవచ్చు.

- సురేందర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని