Punganur-YSRCP: చెంగలాపురం సూరి... ఓ అరాచక శక్తి

సైకిల్‌ యాత్ర చేపట్టిన తెదేపా కార్యకర్తలపై పుంగనూరులో దాష్టీకానికి పాల్పడ్డ వైకాపా నాయకుడు చెంగలాపురం సూరి అలియాస్‌ సురతోటి సురేష్‌ ఓ అరాచక శక్తి. భౌతికదాడులు, అల్లర్లు, నేరాలకు తెగబడుతుండటంతో 2013లోనే పోలీసులు అతనిపై రౌడీషీట్‌ తెరిచారు.

Updated : 23 Oct 2023 08:53 IST

2013లోనే  రౌడీషీట్‌
వైకాపా అధికారంలోకి వచ్చాక ఎత్తివేత
మంత్రి పెద్దిరెడ్డి అండదండలతో పేట్రేగిపోతున్న వైనం

ఈనాడు, చిత్తూరు: సైకిల్‌ యాత్ర చేపట్టిన తెదేపా కార్యకర్తలపై పుంగనూరులో దాష్టీకానికి పాల్పడ్డ వైకాపా నాయకుడు చెంగలాపురం సూరి అలియాస్‌ సురతోటి సురేష్‌ ఓ అరాచక శక్తి. భౌతికదాడులు, అల్లర్లు, నేరాలకు తెగబడుతుండటంతో 2013లోనే పోలీసులు అతనిపై రౌడీషీట్‌ తెరిచారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో మరింత పేట్రేగిపోతున్నాడు. పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో సూరి చేసే అరాచకాలకు లెక్కేలేదు. అధికార పార్టీ నేతల సిఫార్సులు, ఒత్తిళ్లతో అతనిపై ఉన్న రౌడీషీట్‌ను గతేడాది డిసెంబర్‌లో పోలీసులు ఎత్తేశారు. ఆ తర్వాత నుంచి అతను మరింత రెచ్చిపోయాడు. పుంగనూరు పట్టణంలో చెంగలపురంలో నివసించే సూరి..స్థిరాస్తి వ్యాపారం ముసుగులో సెటిల్‌మెంట్లు, దందాలకు తెగబడుతుంటారు. పుంగనూరు నియోజకవర్గంలో తరచూ ఘర్షణలకు దిగుతూ స్థిరాస్తి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు గుంజుతున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కలిసి చెంగలాపురం సూరి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెదేపా కార్యకర్తలపై దాష్టీకానికి పాల్పడిన ఘటనలో సూరితో పాటు ఉన్న వైకాపా నాయకుడు నీరుగట్టి శివప్పకూ నేరచరిత్ర ఉంది. ఆయనపై గతంలో మూడు కేసులు నమోదయ్యాయి. సూరి చేసే సెటిల్‌మెంట్లలో ఇతనిదీ కీలక పాత్ర. సూరి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసే వినయ్‌పై కూడా రెండు కేసులున్నాయి. వీరు ముగ్గురూ కలిసే తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని