Ap News: తెదేపా నేత చంద్రయ్య హత్య కేసు.. 8 మంది అరెస్టు

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపాకు చెందిన తోట చంద్రయ్య(42) గురువారం హత్యకు

Updated : 15 Jan 2022 06:11 IST

వివరాలు వెల్లడించిన గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ

గుంటూరు: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపాకు చెందిన తోట చంద్రయ్య(42) గురువారం హత్యకు గురవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘చంద్రయ్య ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దారిలో ఆపారు. ప్రతిఘటించేలోగా కత్తులతో దాడి చేసి దారుణంగా చంపేశారు. ఈ ఘటన గురువారం ఉదయం7 గంటల నుంచి 7.30 గంటల మధ్య జరిగింది. చంద్రయ్య కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి మొత్తంగా 4 బృందాలను ఏర్పాటు చేశాం. 4 బృందాల్లో కలిపి ఆరుగురు ఎస్ఐలు ఉన్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నాం. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేశాం. వారిలో ప్రధాన నిందితుడు చింత శివరామయ్యతో పాటు చింత ఎలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింత శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింత ఆదినారాయణను అరెస్టు చేశాం.

ఈ కేసులో ప్రధాన నిందితుడు చింత శివరామయ్య, చంద్రయ్య మధ్య గత కొంత కాలంగా గొడవలు నడుస్తున్నాయి. సిమెంట్‌ రోడ్డు విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ 8 మంది నిందితులు ఒకే గ్రామంలో ఉంటారు.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. హత్య జరగడానికి ముందు నిందితుడు శివరామయ్య ఒక కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ.. తోట చంద్రయ్య అనే వ్యక్తి అతడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని, అతని మీద తప్పకుండా దాడి చేస్తాడని కొంత మంది గ్రామస్థులు, కుటుంబసభ్యులు శివరామయ్యకు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే వారిద్దరి మధ్య పాత కక్షలు ఉండటంతో చంద్రయ్య అతడిపై దాడి చేసే ముందే చంద్రయ్యపై దాడి చేయాలని శివరామయ్య నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరో ఏడుగురి సాయం తీసుకొని దారిలో వస్తుండగా బైక్‌ను ఆపి చంద్రయ్యను హతమార్చారు. అన్ని ఆధారాలతో ఈ 8 మందిని అరెస్టు చేశాం. ప్రస్తుతం ప్రధాన నిందితుడు శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉన్నారు’’ అని ఎస్పీ వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టా్న్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినీ వదిలేది లేదని ఎస్పీ హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని