Andhra News: పెళ్లి చేసుకోమంటే గొంతు కోశాడు.. పల్నాడు ఘటన నిందితుడు అరెస్టు

పల్నాడు జిల్లాలో ఇటీవల ఓ యువతి గొంతు కోసి పారిపోయిన నిందితుడు తులసీరామ్‌ను సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

Published : 18 Apr 2022 02:02 IST

సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో ఇటీవల ఓ యువతి గొంతు కోసి పారిపోయిన నిందితుడు తులసీరామ్‌ను సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి సత్తెనపల్లి పోలీసుస్టేషన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘దాచేపల్లికి చెందిన షేక్‌ ఫాతిమా భర్తతో విడిపోయి గత 6 నెలల నుంచి సత్తెనపల్లిలోని పాత బస్టాండు ప్రాంతంలో జనసేన కార్యాలయం ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. కొంత కాలంగా గురజాలకు చెందిన తులసీరామ్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని తులసీరామ్‌ను ఫాతిమా కోరింది. ఈ విషయంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవ తీవ్రస్థాయికి చేరింది. ఫాతిమా ఎంత చెప్పినా వినకపోవడంతో ఆవేశంతో ఉన్న తులసీరామ్‌ ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఆ రోజు అంబేడ్కర్‌ జయంతి కావడంతో తాలూకా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు పార్టీ కార్యాలయానికి వస్తుండగా రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న ఫాతిమాను గమనించారు.

వెంటనే స్పందించిన జనసేన నాయకులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఫాతిమాను సత్తెనపల్లి నుంచి గుంటూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తులసీరామ్‌ కోసం బృందాలుగా ఏర్పడి గాలించారు. పట్టణంలోని చెక్‌పోస్టు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’’ అని ఎస్పీ వివరించారు. హత్యాయత్నం జరిగిన 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని