Crime News: రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటన.. నలుగురి అరెస్టు, దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌ అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటి వరకు రంజిత్‌ సింగ్‌, సునీత్‌ సింగ్‌, సుదర్శన్‌, జస్పాల్‌ సింగ్‌లను

Published : 14 Sep 2022 19:20 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌ అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటి వరకు రంజిత్‌ సింగ్‌, సునీత్‌ సింగ్‌, సుదర్శన్‌, జస్పాల్‌ సింగ్‌లను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు సుప్రీత్‌ సింగ్‌ పరారీలో ఉన్నట్టు చెప్పారు. రంజిత్‌ సింగ్‌ పేరుతో లాడ్జి భవనం ఉంది. ఆయన కుమారులు సునీత్‌ సింగ్‌, సుప్రీత్‌ సింగ్‌ అని పోలీసులు వివరించారు. లాడ్జి, ఈ-బైక్‌ వ్యాపారాలను సునీత్‌, సుప్రీత్‌ చూసుకుంటున్నారు. ఈ-బైక్‌కు ఛార్జింగ్‌ పెట్టడంతో దాని నుంచి మంటలు వెలువడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో సెల్లార్‌లో 28 ఈ-బైక్‌లు, 8 ద్విచక్రవాహనాలు, 4 ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయి. సెల్లార్‌లో ఉన్న 4 సిలిండర్లను పై అంతస్తులో ఉన్న వంటగదికి పైపుల ద్వారా అనుసంధానం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు

సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌ అగ్నిప్రమాద ఘటనపై పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు అధికారి రాజేశ్‌ విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి..అగ్నిమాపక సిబ్బంది, అధికారులను అడిగి వివరాలు సేకరించారు. సెల్లార్‌లో అగ్నిప్రమాదంలో  దగ్ధమైన ఎలక్ట్రిక్‌  వాహనాలకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్‌ సేకరించి తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించిన నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు అందించేందుకే పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు అధికారి రూబీ హోటల్‌కు వచ్చినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అనంతరం స్థానిక పోలీసులు హోటల్‌ మేనేజర్‌ సుదర్శన్‌ నాయుడును హోటల్‌లోనే విచారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని