Crime News: హైదరాబాద్‌లో భారీగా మాదకద్రవ్యాల పట్టివేత

నగరంలో భారీ స్థాయిలో మాదవద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసులకు

Published : 12 Nov 2021 01:56 IST

హైదరాబాద్‌: నగరంలో భారీ స్థాయిలో మాదవద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసులకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మీడియాకు వెల్లడించారు.

సీపీ మాట్లాడుతూ.. ‘‘నగరంలోని నార్త్‌ జోన్‌ పరిధిలో దాదాపు 14.2 కిలోల నిషేధిత సూడో ఎపిడ్రిన్‌ను బేగంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.5.50 కోట్లు ఉంటుందని అంచనా. ఇండియన్‌ మార్కెట్‌లో దీని విలువ కిలోకి రూ. 40 లక్షలు ఉంటుంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ఇచ్చిన సమాచారం మేరకు బేగంపేటలోని ఇంటర్‌నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీలో తనిఖీలు చేశాం. అనుమానం రాకుండా ఫొటో ఫ్రేమ్స్‌లో పెట్టి ప్యాకింగ్‌ చేసి ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. డీఆర్‌ఐ నుంచి వచ్చిన సమాచారం మేరకు కొరియర్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్న 22 ఫొటో ఫ్రేమ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. కొరియర్‌ చేసేందుకుగాను నకిలీ ఆధార్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు దీంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నాం. తదుపరి దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిస్తాయి’’ అని సీపీ వివరించారు.

మత్తు మాత్రల విక్రయం.. ముగ్గురి అరెస్టు..

నగరంలో మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముగ్గురిని ఆసిఫ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 110 ఎండీఎంఏ టాబ్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా మత్తు మాత్రలు విక్రయిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాయి చరణ్‌, రాచర్ల అంకిత్‌, అజయ్‌ సాయిని అదుపులోకి తీసుకున్నాం.

తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలి..

పోలీస్‌ శాఖ తరఫున నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పిల్లలకు ఖర్చులకు డబ్బు ఇస్తున్నారు. దాన్ని వారు ఎలా ఖర్చు చేస్తున్నారు.. ఎందుకోసం ఖర్చు చేస్తున్నారనే విషయాలను మీరు గమనించాలి. డబ్బున్న వారు, ఎగుమ మధ్యతరగతి కుటుంబాల పిల్లలను టార్గెట్‌ చేసుకొని మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండడమే కాకుండా.. పిల్లలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని సీపీ వెల్లడించారు.

ఖమ్మంలో పొడి గంజాయి స్వాధీనం..

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీగా పొడి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.40 కోట్లు విలువైన 566 కిలోల పొడి గంజాయిని పట్టుకున్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని