Crime News: ‘బంగారం’ లాంటి మోసం.. నలుగురు సభ్యుల ముఠా అరెస్టు

తక్కువ ధరకే బంగారం అమ్ముతామని చెప్పి.. దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముఠాను కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షలు స్వాధీనం

Updated : 04 Nov 2021 11:32 IST

కాచిగూడ: తక్కువ ధరకే బంగారం అమ్ముతామని చెప్పి.. దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముఠాను కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాచిగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలో మహ్మద్‌ రఫిక్‌, శ్రీనివాసరావు, పాండురంగారావు, అన్వేష్‌ కుమార్‌, వికాస్‌ గౌతం, అమిత్‌ పటేల్‌ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని చెప్పి మోసాలు  చేయడం ప్రారంభించారు. తాజాగా ఒక వ్యక్తిని ఫేస్‌బుక్‌ ద్వారా బురిడీ కొట్టించారు. మొదటగా ఫేస్‌బుక్‌ ద్వారా ముఠా సభ్యుడు వికాస్‌ బాధితుడిని పరిచయం చేసుకున్నాడు. బంగారం తెచ్చామని చెప్పి బాధితుడిని నమ్మించారు. మొదట్లో బంగారం చూపించి.. ఆ తర్వాత బాధితుడు తీసుకొచ్చిన రూ.38 లక్షలు తీసుకున్నారు. నగదు ఉన్న బ్యాగ్‌లో నకిలీ కరెన్సీ నోట్లను పెట్టి బాధితుడి దృష్టి మళ్లించి ముఠా సభ్యులు అక్కడ నుంచి పరారయ్యారు.

బ్యాగ్‌లో అసలు నోట్లకు బదులు నకిలీ కరెన్సీ ఉండటంతో వెంటనే బాధితుడు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన  పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అంతర్రాష్ట్ర ముఠా చేసిన పనిగా భావించిన పోలీసులు నిందితులు ఎక్కడెక్కడ తిరిగారు.. ఏం చేశారనే వివరాలను సేకరించారు. సేకరించిన వివరాల ఆధారంగా ముంబయి, కర్ణాటకలోని సిర్సీ, తెలంగాణలోని మంచిర్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో నిందితులు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాచిగూడ పరిధిలో మరో వ్యక్తిని కూడా మోసం చేసేందుకు ఈ ముఠా ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలో నలుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దోచుకున్న నగదు రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని