logo

అత్తామామలను ఒప్పించి.. భర్తను మెప్పించి

అప్పటివరకు ఉన్నతంగా చదివిన అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యేవారు.. ఇది గతం.. కాలం మారింది.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారు ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ముందుకు

Updated : 28 May 2022 06:26 IST

ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్న గృహిణులు

న్యూస్‌టుడే, భుక్తాపూర్‌(ఆదిలాబాద్‌)

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మహిళలు

అప్పటివరకు ఉన్నతంగా చదివిన అమ్మాయిలు పెళ్లయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యేవారు.. ఇది గతం.. కాలం మారింది.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వారు ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు తీర్చేందుకు పట్టుదలతో ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. అందుకు వారు భర్త, అత్త, మామయ్యలను ఒప్పించారు, మెప్పించారు. ఉదయమే వంటలు, ఇతర పనులు చేసుకుంటున్నారు. తమ పిల్లలను ఇంటి పెద్దల వద్ద వదిలేసి గ్రంథాలయ బాట పడుతున్నారు. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ గృహిణులతో పలకరించింది.. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా పదేసి గంటలు పఠన గదిలో గడుపుతున్నామంటున్నారు.

జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రోజూ 30 మందికి పైగా మహిళలు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వస్తున్నారు. అందులో సగం మంది వివాహితులు ఉండడం విశేషం.


అందరి ప్రోత్సాహంతో..

- చనగరపు భావన, ఆదిలాబాద్‌

మా ఆయన పేరు సంజయ్‌కుమార్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. 2019లో పెళ్లయింది. మాకొక పాప. అందరం కలిసే ఉంటాం. నేను డీఈడీ, బీఈడీ, డిగ్రీ పూర్తి చేశా. పెళ్లికంటే ముందు డీఎస్సీ రాశా. స్వల్ప మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకొని టెట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నా. అత్త, మామయ్య, భర్త ప్రోత్సాహంతో రోజూ గ్రంథాలయానికి వస్తున్నా.


గూడ నుంచి రోజూ ఆదిలాబాద్‌కు..

- గొంటిముక్కుల సరిత, గూడ(జైనథ్‌)

నేను, నా భర్త సంజీవ్‌ ఇద్దరం రోజూ జైనథ్‌ మండలం గూడ నుంచి 15 కి.మీ.లు ప్రయాణించి ఆదిలాబాద్‌కు వస్తున్నాం. గ్రంథాలయంలో వేర్వేరుగా టెట్‌ కోసం సన్నద్ధమవుతున్నాం. 2010లో పెళ్లయింది. మాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ రంగ సంస్థల్లో సాగింది. ఎంఏ తెలుగు, బీఈడీ పూర్తయింది. రెండేళ్లు విద్యావాలంటీరు(వీవీ)గా పని చేశా. కరోనా అనంతరం మళ్లీ వీవీగా తీసుకోలేదు. బోధన రంగంలో ఎదగాలన్నదే నా అభిలాష.


పట్టుదలతో ముందుకు..

- ప్రజ్ఞ, కూర(జైనథ్‌)

భర్త వెంకటి. వ్యవసాయం చేస్తుంటారు. 2018లో పెళ్లయింది. నాలుగేళ్ల పాప ఉంది. 2017లో బీఈడీ పూర్తయింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2018 నుంచి 2020 వరకు విద్యావాలంటీర్‌గా పని చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో రోజూ జైనథ్‌ మండలం కూర గ్రామం నుంచి బస్సులో వస్తున్నా. పాపను అత్తమ్మ, మామయ్య బాగా చూసుకుంటున్నారు. అమ్మ గుర్తుకు రాకుండా ఆడిస్తున్నారు. లాలిస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు తిరిగి నా గ్రామానికి బస్సులో వెళుతున్నా.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని