logo

చినుకొస్తే వణుకే!

వర్షాకాలం.. కొన్ని గ్రామాలకు నిజంగా వణుకే. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. కల్వర్టులను వంతెనలుగా నిర్మించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోక ఏటా వర్షాకాలంలో ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. వర్షాకాలంలో ఇలాంటి వంతెనల

Published : 25 Jun 2022 04:24 IST

లోలెవల్‌ కల్వర్టులతో గ్రామాలకు నిలిచిపోతున్న రాకపోకలు

న్యూస్‌టుడే, తాంసి, నేరడిగొండ

వర్షాకాలం.. కొన్ని గ్రామాలకు నిజంగా వణుకే. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. కల్వర్టులను వంతెనలుగా నిర్మించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోక ఏటా వర్షాకాలంలో ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. వర్షాకాలంలో ఇలాంటి వంతెనల మూలంగా జిల్లా వ్యాప్తంగా 75 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోతున్నాయి.  

ఆధునికీకరణ లేక..

జిల్లాలో చాలా వరకు వాగులపై ఉన్న వంతెనల ఆధునికీకరణ కనిపించడం లేదు. పాత వంతెనలు, లోలెవల్‌ కావడంతో వర్షాకాలం ప్రవాహ వేగం పెరిగినప్పుడు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు ఏటా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి తోడు వాగులు, ఓర్రెలపై వేసిన పైపుల్లో చెత్తాచెదారం, మట్టి పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డుగా మారి, వాగుల ఉద్ధృతి పెరిగి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలో వాగులు దాటే క్రమంలో 8 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకోగా, చాలా మంది వరద ప్రవాహంలో చిక్కుకుని త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం జిల్లాలోని తాంసి, భీంపూర్‌, నేరడిగొండ, తలమడుగు, జైనథ్‌, బేల, ఇంద్రవెల్లి, సిరికొండ, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ గ్రామీణం, బోథ్‌ మండలాల్లో దాదాపు 40కిపైగా  ఒర్రెలు, వాగులపై చాలా చోట్ల వంతెనలన్నీ లో-లెవెల్‌వి, వీటిని హై-లెవెల్‌ వంతెనలుగా నిర్మించాలంటే రూ.కోట్లల్లో ఖర్చవుతుంది. ప్రభుత్వం నుంచి వంతెనల కోసం నిధులు రాకపోవడంతో అడుగు ముందుకు పడటం లేదు.

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి..

కల్వర్టులు, వంతెనల వద్ద రహదారుల శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి. వరద ఉద్ధృతి సమయంలో కింద గల పైపుల్లో కంప, చెట్ల కొమ్మలు ఇరుక్కుపోతే వాటిని తొలగించాలి. వంతెనకు అటుఇటుగా దిమ్మలను ఏర్పాటు చేయాలి. వాటి ఆధారంగానే ప్రవాహాన్ని అంచనా వేయవచ్చు. కానీ సంబంధిత శాఖ అధికారులు ముందస్తు చర్యలపై దృష్టిపెట్టకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రక్షణ శాఖ వాగుల సమీపంలో ప్రత్యేక చర్యలు చేపట్టి, వరదలు పోటెత్తినప్పుడు వాగులు, వంతెనల మీదుగా జనం వెళ్లకుండా చూస్తే కొంతవరకు ప్రమాదాలను నివారించవచ్చు.


వాగు దాటడం కష్టమే..

నేరడిగొండ సమీపంలోని బండ్రేవ్‌ వాగుపై దిగువ వంతెన ఉండడంతో వర్షాకాలం వరదనీటి ప్రవాహానికి వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే అవతల వైపు ఉన్న సావర్‌గామ్‌, కుంటాల, గోవింద్‌పూర్‌, వెంకటపూర్‌, వాగ్దారి, లక్ష్మీపూర్‌, పిచార, అద్దాల తిమ్మపూర్‌ తదితర గ్రామాల ప్రజలు ప్రతి ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు వరుసల రహదారిని నిర్మించిన ప్రభుత్వం కల్వర్టుల స్థానంలో నూతనంగా వంతెనలు నిర్మించక ప్రయాణ కష్టాలతో పాటు విద్య, వైద్యం ఇతర సేవలకు ఇబ్బందులు తప్పడం లేదు.


చిన్నపాటి వర్షానికే..

తాంసి మండలం కప్పర్ల ఎక్స్‌రోడ్డు సమీపంలోని చిన్న వాగుపై ఉన్న లోలెవల్‌ కల్వర్టు ఇది. ఆదిలాబాద్‌ నుంచి జందాపూర్‌, ఘోట్కురి గ్రామాల మీదుగా భీంపూర్‌ మండలం కరంజి(టి), మహారాష్ట మాండ్వి చేరుకోవడానికి వెళ్లే అంతర్రాష్ట్ర రహదారికి మధ్యలో ఉంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు కల్వర్టుపై నుంచి వరదనీరు ప్రవహించడం పరిపాటిగా మారుతోంది. 28 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని