logo

ఇరువర్గాల సమ్మతం.. సమస్యకు పరిష్కారం

‘రాజీ మార్గమే రాజ మార్గం’ అని ప్రభుత్వం ప్రారంభించిన లోక్‌ అదాలత్‌లు కక్షిదారులకెతంతో మేలు చేస్తున్నాయి. సమ్మతితో కేసులను పరిష్కరించుకుంటే సమయం ఆదా కావటంతో పాటు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారని

Published : 25 Jun 2022 04:24 IST

ఆశించిన న్యాయం, సహృద్భావానికి దారి

రేపు జిల్లాలో ‘జాతీయ లోక్‌ అదాలత్‌’

ఎదులాపురం, న్యూస్‌టుడే  

‘రాజీ మార్గమే రాజ మార్గం’ అని ప్రభుత్వం ప్రారంభించిన లోక్‌ అదాలత్‌లు కక్షిదారులకెతంతో మేలు చేస్తున్నాయి. సమ్మతితో కేసులను పరిష్కరించుకుంటే సమయం ఆదా కావటంతో పాటు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారని ఇరు వర్గాలు కూడా విజేతలుగా నిలిచి సహృద్భావం పెంపొందుతుందని ఏటా కనీసం మూడునాలుగు సార్లు వీటిని నిర్వహిస్తున్నారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు తగ్గి కక్షిదారులకు సత్వర న్యాయం అందించటానికి లోక్‌ అదాలత్‌లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ప్రభుత్వం 1976లో భారత రాజ్యాంగానికి 39-ఏ జత చేసి పేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయం అందించటానికి న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం అందిస్తోంది. ఈ సంస్థను ఆశ్రయించిన వారికి ప్రీలిటిగేషన్‌ కేసులుగా పరిగణించి సముచిత న్యాయం అందిస్తున్నారు. ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.

కక్షిదారుల సమ్మతితో న్యాయస్థానాల్లో దావాలను పరిష్కరించుకోవటానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లోక్‌ అదాలత్‌లు చక్కటి దారిని చూపుతున్నాయి. చిన్నపాటి తగాదాలు, ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు, బీమా కేసులు, మోటారు వాహన దావాలు, భూవివాదాలు, ఆబ్కారీ, డ్రంకన్‌డ్రైవ్‌ కేసులు, దంపతుల మధ్య విభేదాలు తదితరాలను రాజీ మార్గం ద్వారా ఇందులో పరిష్కరించే వీలు కల్పిస్తున్నాయి. రాజీ మార్గం ద్వారా దావాలను వెంటనే పరిష్కరించటంతో కక్షిదారులకు సమయం ఆదా కావటంతో పాటు ఇందులో ఇచ్చిన తీర్పుపై అప్పీలు సైతం చేసుకోవటానికి వీల్లేకుండా ఇవి ఉపకరిస్తున్నాయి.

పెండింగ్‌ కేసుల పరిష్కారం..

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 30 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టులు జిల్లాల వారీగా విడిపోయాక ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో 10,135 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చిన్నాచితక వివాదాలతో పాటు పలు రకాల దావాలు కోర్టుల్లో ఏళ్ల తరబడిగా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో కోర్టులపై భారం పెరిగిపోతోంది. కక్షిదారులు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ తమ విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవాల్సి వస్తోంది. దీనికి పరిష్కారం చూపటానికి ప్రభుత్వం లోక్‌ అదాలత్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటారు కాబట్టి కక్షలు, కార్పణ్యాలకు సైతం తావు లేకుండా ఇరువురి మధ్య స్నేహతత్వం బలపడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం లోక్‌ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారాన్ని ప్రోత్సహిస్తోంది.

మనస్పర్థలు వీడి ఒక్కటయ్యారు

దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడి విడాకుల కోసం దంపతులు కోర్టును ఆశ్రయించారు. మూడేళ్లుగా విడిగానే ఉంటున్నారు. వీరి కేసును సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయభాస్కర్‌రావు స్వీకరించి ఆ దంపతులకు అవగాహన(కౌన్సెలింగ్‌) నిర్వహించారు. డీఎల్‌ఎస్‌ఏ ఛైర్మన్‌ ఈ కేసును ప్రత్యేకంగా చేపట్టి దాంపత్య జీవితం గురించి గతేడాది డిసెంబరులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో వారికి వివరించి నచ్చచెప్పారు. విడాకులు తీసుకోవటానికి నిర్ణయించుకున్న ఆ దంపతులు కలిసి ఉండటానికి అంగీకరించారు. ప్రస్తుతం వారిద్దరు ఎలాంటి వివాదాలు లేకుండా సుఖంగా వారి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు.
ఇలా ఎన్నో కుటుంబ తగాదాలు పరిష్కారం కావటంతో పాటు లోక్‌ అదాలత్‌ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడుతున్నాయి.


ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమా దేశ్‌పాండె

లోక్‌ అదాలత్‌ ద్వారా దావాలను పరిష్కరించుకోవటం కక్షిదారులకు ఎంతగానో మేలు. అప్పీలుకు వీలు కాని విధంగా కేసులను పరిష్కరించటంతో పాటు చెల్లించిన కోర్టు ఫీజులు సైతం తిరిగి కక్షిదారులకు చెల్లిస్తారు. సమయం వృథా కాకుండా ఉండటంతో పాటు గొడవలకు ఆస్కారం ఉండదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని