logo

అస్తవ్యస్తం.. ఇష్టానుసారం

మూడేళ్ల నుంచి సాగుతున్న నాలుగు వరుసల రహదారి పనులు జిల్లాలో అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. అవసరమైన చోట వీయూపీ (వెహికల్‌ అండర్‌ పాసింగ్‌)లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.

Published : 27 Jan 2023 05:45 IST

జాతీయ రహదారి పనుల తీరిది..
ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌

మూడేళ్ల నుంచి సాగుతున్న నాలుగు వరుసల రహదారి పనులు జిల్లాలో అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. అవసరమైన చోట వీయూపీ (వెహికల్‌ అండర్‌ పాసింగ్‌)లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. వంద కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకుపోయే విధంగా డిజైన్‌ (రూపుదిద్దిన) చేసిన ఈ రోడ్డుపై ఆయా గ్రామాల ప్రజలు ప్రమాదకరంగా రోడ్డును దాటాల్సి వస్తోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నేతలు, అధికారుల సిఫార్సుకు తలొగ్గి వీయూపీలను ఇష్టానుసారంగా మార్చారని ప్రజలు ధర్నాలు చేయడం పరిపాటిగా మారింది.

రెబ్బెన మండలం రెపల్లెవాడ నుంచి వాంకిడి మండలం గోయగాం వరకు 54 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారి పనులకు రూ.1140 కోట్లు కేటాయించగా.. 2022 మార్చి నెల వరకు గడువు విధించారు. సంవత్సరం దాటినా పనులు పూర్తి కాలేదు. మరోవైపు డిజైన్‌ విషయంలో పలు గ్రామాల ప్రజలు మొదటి నుంచి అభ్యంతరాలు తెలుపుతూనే ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తమకు నచ్చినట్లుగా పనులు చేస్తున్నారే తప్పితే ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదు. మట్టి పనులు సాగుతున్న చోట దుమ్ము లేవకుండా కనీసం నీళ్లు సైతం పట్టకపోవడంతో.. దారి వెంట ప్రయాణించే వారు నిత్యం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సర్వీసు రోడ్లు లేక ఇక్కట్లు..

నాలుగు వరుసల దారిలో వాహనాలు వేగంగా దూసుకుపోతుంటాయి. గ్రామాల సమీపంలో రహదారికి పక్కన సర్వీసు రోడ్లను ఏర్పాటు చేస్తారు. ప్రజలు రహదారిపైకి రావడానికి ఈ దారులే కీలకం. అయితే రెబ్బెన మండలంలోని పులికుంట, నక్కలగూడ, కొండపల్లి వద్ద సర్వీసు రోడ్లే ఏర్పాటు చేయలేదు. ఈ ప్రాంతవాసులు నేరుగా ప్రధాన రహదారిపైకి రావాల్సి ఉంటుంది. నక్కలగూడ వద్ద సైతం వీయూపీ నిర్మించకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరం ఆ గ్రామస్థులు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. మహారాష్ట్ర గ్రామాలను అనుసంధానించే ఇందాని రోడ్డు వద్ద సైతం వీయూపీ నిర్మించలేదు. ప్రజలు రెండు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిందే. లేకపోతే తప్పుడు మార్గంలో ప్రమాదాలకు ఎదురెళ్లాల్సి వస్తుంది.

అభ్యంతరాలు.. ఆందోళనలు

వాంకిడి మండల కేంద్రంలో సైతం ప్రధాన వాణిజ్య సముదాయంలో చౌపన్‌గూడ వెళ్లే మార్గంలో వీయూపీ నిర్మిస్తామని మొదట కొలతలు తీసుకున్నా.. కొద్ది దూరంలోకి మార్చి పనులు ప్రారంభించారు. మొదట అనుకున్న ప్రదేశంలోనే వీయూపీ నిర్మించాలని ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

నాలుగు వరుసల రహదారి మంజూరైన అనంతరం వాంకిడి వాగుపై రూ.5 కోట్ల వ్యయంతో వంతెన నిర్మించారు. ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి నిర్మాణ గుత్తేదారు ఈ వంతెనను కూల్చివేశారు. కేవలం నాలుగు సంవత్సరాల కోసం రూ.5 కోట్ల వ్యయంతో వంతెన నిర్మించి, ముందు చూపు లేకుండా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అవసరమైతే నిర్మిస్తాం..

రవీందర్‌రావు, ఎన్‌హెచ్‌ఏఐ, పీడీ

ఇంతకు ముందు రూపొందించిన ఆకృతి ప్రకారమే వీయూపీలు, సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కాకుండా మళ్లీ అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేస్తాం. మార్చి వరకు పనులు పూర్తయ్యేలా చూస్తాం. వాంకిడి వీయూపీ ఇంతకు ముందు రూపొందించిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని