logo

ఎట్టకేలకు జడ్పీ జీపీఎఫ్‌ విభజన

ఎట్టకేలకు పంచాయతీరాజ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ భవిష్య నిధిని విభజించారు. కొత్త జిల్లా పరిషత్‌లకనుగుణగా పూర్తి వివరాలను ఆదిలాబాద్‌ నుంచి పంపించారు.

Published : 02 Jun 2023 04:05 IST

జిల్లాలవారీగా ఖాతాదారుల కేటాయింపు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: ఎట్టకేలకు పంచాయతీరాజ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ భవిష్య నిధిని విభజించారు. కొత్త జిల్లా పరిషత్‌లకనుగుణగా పూర్తి వివరాలను ఆదిలాబాద్‌ నుంచి పంపించారు. ఇక ఎక్కడికక్కడే జీపీఎఫ్‌ రుణాలు తీసుకోవడం, సందేహాలు నివృత్తి చేసుకోవడం ఖాతాదారులకు సులభం కానుంది. 14 ఏళ్లుగా రాని వడ్డీపై మాత్రం ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో అది వస్తుందా? రాదా? అనే సందేహాలు నెలకొన్నాయి.
మండల పరిషత్‌ కార్యాలయాలు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బందినంతా పంచాయతీరాజ్‌ ఉద్యోగులుగా పరిగణిస్తారు. మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ పీఆర్‌ ఉద్యోగులు డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ఉద్యోగులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం సాధారణ భవిష్య నిధిని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు అందులో నెలవారీగా డబ్బులు జమ చేసుకుంటే వడ్డీ చెల్లించేవారు. గతంలో 8 శాతం వడ్డీ ఉండగా రెండేళ్ల కిందట 7.1 శాతానికి తగ్గించారు. జమ చేసుకున్న దాంట్లో 50 శాతం రుణం ఇచ్చేందుకు వెసులుబాటు ఉండటంతో ప్రతి ఉద్యోగి ఇందులో ఖాతాదారుగా చేరారు.

జడ్పీ విభజన జరిగినా..

పరిపాలన వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలను ఏర్పాటుచేయగా అప్పటికే జిల్లా పరిషత్‌లో పాలకవర్గాలు కొలువుదీరి ఉండటంతో జడ్పీ విభజన సాధ్యం కాలేదు. 2019 జులై 4న ఆదిలాబాద్‌తో పాటు కొత్తగా నిర్మల్‌, మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో కొత్త జిల్లా పరిషత్‌లు రూపుదిద్దుకున్నాయి. జీపీఎఫ్‌ ఖాతాదారుల విభజనపై తర్జనభర్జన పడాల్సి వచ్చింది. నాలుగు జిల్లాల్లో పని చేస్తున్న కొందరు ఉద్యోగుల పోస్టింగ్‌ ఒక జిల్లాలో పని చేసేది మరో జిల్లాలో కావడంతోనే తికమక పడ్డారు. ప్రస్తుతం జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన జరగడంతో వారు పని చేసే జిల్లాను కొలమానంగా తీసుకొని జీపీఎఫ్‌ను ఖాతాలను మళ్లించారు. ఇందుకు ఆదిలాబాద్‌ జీపీఎఫ్‌ విభాగంలోని సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. ఎట్టకేలకు కొత్త జడ్పీలు ఏర్పడిన దాదాపు నాలుగేళ్లకు ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి విభజన పూర్తికావడంతో ఉద్యోగుల్లోనూ సంతోషం కనిపిస్తోంది.

ఆయా జిల్లాల డిప్యూటీ సీఈఓలకు అధికారం

ఇంతకుముందు మంచిర్యాల జిల్లా ఉద్యోగి తాను జమ చేసుకున్న డబ్బుల్లోంచి రుణం కావాలంటే తన డ్రాయింగ్‌ అధికారి నుంచి ఆ జిల్లా సీఈఓకు వివరాలు పంపించేవారు. అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు పోస్టులో వివరాలు వచ్చేవి. ఆదిలాబాద్‌లో అన్ని వివరాలు పరిశీలించి రుణం మంజూరు చేసి ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. ఏదైనా సమస్య ఉంటే సదరు ఉద్యోగి ఆదిలాబాద్‌ రావాల్సి వచ్చేది. ఇక నుంచి ఎక్కడికక్కడ జడ్పీల్లోని డిప్యూటీ సీఈఓనే ఈ వ్యవహారం చక్కబెట్టనుండటంతో ఖాతాదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. అయితే 2009 నుంచి ఖాతాదారులు జమ చేసిన డబ్బులకు వడ్డీ రాకపోవడం సమస్యగా మారింది. ప్రస్తుతం రూ.236 కోట్ల వడ్డీ రావాల్సి ఉంది. ఆ వడ్డీ రాక ప్రస్తుతం ఉద్యోగులు జమ చేసిన (అసలు)ను లెక్కించి ఖాతాల వారీగా వివరాలు అందించారు. డబ్బులు సైతం ఆయా జడ్పీలకు ట్రెజరీ నుంచి పంపించారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాకపోయినా పదవీ విరమణ ఉద్యోగులకు మొత్తం జమ ఉన్న డబ్బులోంచే వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. దీంతో ఉద్యోగుల నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు రావడం లేదు.
* ఈ విషయమై ఆదిలాబాద్‌ జడ్పీ సీఈఓ గణపతి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ రెండుమూడు రోజుల్లో విభజన అమల్లోకి రానుందని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని