logo

చెన్నూరుపై వీడని ఉత్కంఠ

చెన్నూరు నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌, వామపక్షాల పొత్తులో భాగంగా చెన్నూరును సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారంతో ఇరు పార్టీల శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. పొత్తులో ఏ పార్టీకి సీటు దక్కుతుందో తెలియని ఆయోమయ పరిస్థితులు నెలకొనగా నేడు ఉత్కంఠ వీడే అవకాశాలు ఉన్నాయి.

Updated : 25 Oct 2023 09:15 IST

కాంగ్రెస్‌కా.. సీపీఐకా?

చెన్నూరు, చెన్నూరు గ్రామీణం, మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే : చెన్నూరు నియోజకవర్గంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌, వామపక్షాల పొత్తులో భాగంగా చెన్నూరును సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారంతో ఇరు పార్టీల శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. పొత్తులో ఏ పార్టీకి సీటు దక్కుతుందో తెలియని ఆయోమయ పరిస్థితులు నెలకొనగా నేడు ఉత్కంఠ వీడే అవకాశాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా కొత్తగూడెంతోపాటు చెన్నూరు నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తూ కాంగ్రెస్‌ అదిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది. దీంతో చెన్నూరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశాలు ఉన్నాయి.

శ్రేణుల్లో నిరాశ

చెన్నూరు స్థానం ఆశిస్తూ కాంగ్రెస్‌ నుంచి 14 మంది ఆశావహులు ఎన్నికల ప్రచారంలో తిరిగారు. అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా ఎవరి ప్రయత్నాలు వారు చేపట్టారు. వామపక్షాల పొత్తులో ఈ స్థానం సీపీఐకి కేటాయిస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఆందోళనకు గురై కొంత వెనక్కి తగ్గారు. ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్‌ను కాదని సీపీఐకి కేటాయించడంపై పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇంతకాలం క్షేత్రస్థాయిలో ప్రచారం సాగించిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. అయితే కార్మిక క్షేత్రానికి చెందిన నల్లాల ఓదెలు కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అధిష్ఠానం ఓదెలు వైపే మొగ్గుచూపుతోందని ప్రచారం జరిగింది. సీపీఐకి కేటాయిస్తున్నట్లు వార్తలు రావడంతో ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. అధికారికంగా ప్రకటన వెలువడిన అనంతరం ఓదెలు తమ అనుచరవర్గంతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

సీపీఐ అభ్యర్థిపై చర్చ

చెన్నూరుపై సీపీఐ పార్టీ అంతగా దృష్టి సారించకపోవడంతో నియోజకవర్గంలో ఆపార్టీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. నియోజకవర్గంలో ఎవరి పేరు ఖరారు కాకపోగా మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప అభ్యర్థి ఎవరనేది తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

కాంగ్రెస్‌లోకి ఓ కీలక నేత?

భాజపాకు చెందిన ఓ కీలక నేత కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ స్థానం సీపీఐకి కేటాయిస్తున్నారన్న అంశం తెరపైకి రావడంతో అంతా కంగుతింటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని.. చివరి నిమిషంలో రాజకీయ పరిస్థితులు మారడం సహజమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని