logo

విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ఉన్నతాధికారుల సమీక్ష

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్యపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మంగళవారం ఎస్పీ జానకిషర్మిల, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ బాసరకు వచ్చారు.

Published : 17 Apr 2024 06:26 IST

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్యపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మంగళవారం ఎస్పీ జానకిషర్మిల, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ బాసరకు వచ్చారు. విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విశ్వవిద్యాలయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి హాజరు శాతం తగ్గితే యూనివర్సిటీ పరంగా కౌన్సిలింగ్‌ నిర్వహించారా అనే ప్రశ్నకు అధికారులు సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. వసతి గృహంలోని గదుల్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తోందా, వరుసగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారని మందలించారని సమాచారం.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని సూచించారు. 60-65 మంది విద్యార్థులను బృందంగా విభజించి ఒక ఫ్యాకల్టీని కేటాయించాలన్నారు. తరచూ విద్యార్థులను గమనించాలన్నారు. కౌన్సిలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. వసతి గృహాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, ఆర్జీయూకేటీ ఆయా విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

 నిర్లక్ష్యం చేస్తే చర్యలు

 నిర్మల్‌ పట్టణం: జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పాలనాధికారి అశిష్‌ సాంగ్వాన్‌ మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. పట్టణంలోని ఈద్‌గాం, శివాజీచౌక్‌ ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. మురుగుకాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడిచెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించాలన్నారు. ప్రధాన కూడళ్లు, రహదారులు, మురుగుకాలువల్లో చెత్తచెదారం పడేయకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. రహదారులపై చెత్త వేస్తే దుకాణం, హోటల్స్‌, మాల్స్‌, ఆసుపత్రుల యజమానులకు అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. వందశాతం ఆస్తి పన్ను వసూళ్లు చేపట్టాలన్నారు. అదనపు పాలనాధికారి ఫైజాన్‌ అహ్మద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సి.వి.ఎన్‌.రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని