logo

కరెంటోళ్లు కనికరించరేం?

జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌ ఆలస్యం కావడంతో.. ఇప్పుడిప్పుడే పంటలు చివరి దశకు చేరుతున్నాయి. వరి పంట కంకి దశలో ఉంది.

Published : 17 Apr 2024 06:33 IST

 పంటలు ఎండుతున్నా.. నియంత్రికల మరమ్మతులు కరవు!

 కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌ ఆలస్యం కావడంతో.. ఇప్పుడిప్పుడే పంటలు చివరి దశకు చేరుతున్నాయి. వరి పంట కంకి దశలో ఉంది. ఈ సమయంలో నీటి తడులు అందించాల్సి ఉండగా.. విద్యుత్తు సరఫరాలో ఎదురవుతున్న సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నియంత్రికల మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు, బోరుబావుల ఆయకట్టు కింద ఈ యాసంగిలో 18,034 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ డివిజన్ల పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు 12,812 వరకు ఉండగా.. 5,921 నియంత్రికలు ఉన్నాయి. అత్యవసర వేళల్లో కొన్నింటిని అధికారులు నిల్వ ఉంచుకోవాలి. ప్రస్తుత వేసవిలో చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా మరమ్మతులకు గురైతే 48 గంటల్లో మరొకటి అమర్చాలనే నిబంధనలున్నాయి. నియంత్రికలను మరమ్మతు చేసి పొలం వరకు రవాణా చేయడానికి విద్యుత్తు శాఖనే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. కానీ రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని రవాణా ఖర్చుల భారం వారిపైనే వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బోరుబావుల కింద సాగు చేస్తున్న అన్నదాతలకు నియంత్రికల మరమ్మతుల సమస్య కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కొన్ని మండలాల్లో ఏఈ స్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర వేళల్లో చరవాణిలో సంప్రదించినా స్పందించడం లేదని, చేయి తడిపిన వారికే పనులు చేస్తున్నారని వాపోతున్నారు.

ఈజ్‌గాం శివారులోని పొలంలో మరమ్మతుకు నోచుకోని నియంత్రిక వద్ద ఉన్న రైతు పేరు రాంటెంకి మల్లయ్య. మూడు ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. నాట్లు పూర్తికాగానే నియంత్రిక మరమ్మతులకు గురైంది. పలుమార్లు ఏఈకి సమస్యపై సమాచారం ఇచ్చినప్పటికీ నెలరోజులైనా మరమ్మతులు చేయలేదని, వేరేది అమర్చలేదని వాపోతున్నారు. బోరులో నీరున్నా విద్యుత్తు లేక పొలం మొత్తం ఎండిపోయింది. దీంతో అతను పంటనే వదిలేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని