logo

అక్షరాలై వెలిగే చోట.. ఆగని కన్నీళ్లు

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ప్రాభవం విద్యార్థుల వరుస బలవన్మరణాలతో మసకబారుతోంది.

Published : 17 Apr 2024 06:40 IST

మసకబారుతున్న ఆర్జీయూకేటీ ప్రాభవం

అధికారుల ఏకపక్ష నిర్ణయాలతో విషాదం

ఈటీవీ- ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే-ముథోల్‌: నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ప్రాభవం విద్యార్థుల వరుస బలవన్మరణాలతో మసకబారుతోంది. ప్రభుత్వాల పట్టింపులేనితనం, ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలమధ్య భవిష్యత్తును ఊహించుకో

 లేని అంతర్ముఖులైన విద్యార్థుల భావిజీవితం అగమ్యగోచరంగా మారుతోంది. కనిపెంచిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఆర్జీయూకేటీ వసతిగృహాల్లోనే ప్రాణాలు తీసుకోవటం విషాదాన్ని నింపుతోంది. విశ్వవిద్యాలయం ప్రారంభమైన 2008 మొదలుకొని 2023 జూన్‌ 13 వరకు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు ఒడిగడితే.. 2023 జూన్‌ 15 నుంచి తాజాగా మంగళవారం సిద్దిపేట జిల్లా విద్యార్థి ఆత్మహత్య వరకు మరో ఆరుగురు బలవన్మరణాలకు పాల్పడటంతో ఆర్జీయూకేటీ విషాదాశ్రువుల కేంద్రంగా నిలిచినట్లవుతోంది. చనిపోతున్నవారందరూ గ్రామీణ, పేద విద్యార్థులే. నూతన వాతావరణం, కొత్త పరిచయాలకు అనుగుణంగా భావి జీవితాన్ని నిర్దేశించుకునే క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేక జీవితాలను అర్ధంతరంగా ముగించుకోవటం విషాదానికి కారణమవుతోంది.

లక్ష్యమేంటి

పల్లెలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతిలో ప్రతిభ కనబర్చే విద్యార్థులను మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2008 మార్చిలో ఆర్జీయూకేటీ ఏర్పడింది. రాష్ట్రంలో మిగిలిన విశ్వవిద్యాలయాలకు భిన్నంగా ఇది సాంకేతిక విద్యకు మాత్రమే ప్రాధాన్యం కలిగిన విద్యాలయంగా ప్రసిద్ధి పొందింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ప్రతిభ కలిగిన గ్రామీణ విద్యార్థులకు ప్రవేశం ఉండేలా విశ్వవిద్యాలయం రూపకల్పన జరిగింది. పైగా 2008 నుంచి 2010 వరకు ఏడాదికి 2 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే విధానం అమలైతే 2010 నుంచి వెయ్యికి తగ్గించారు. తర్వాత 2015లో విశ్వవిద్యాలయం బడ్జెట్‌ని పెంచుకునే ఆలోచనతో గ్రామీణ ప్రాంత విద్యార్థులతో సంబంధం లేకుండా విద్యార్థులెవరైనా రూ.లక్ష ఫీజుతో గ్లోబల్‌ సీట్‌ కింద అదనంగా వంద సీట్లు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

కలవరపాటుకు కారణమిదే!

2023 విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్‌ పరీక్షలకు బదులు యానువల్‌ మోడ్‌(వార్షిక విధానం) అమలు చేయడం విద్యార్థులపై ప్రభావం పడింది. సెమిస్టర్‌ విధానమైతే వెనకబడిన సబ్జెక్టుల్లో నాలుగు నెలల్లో విద్యార్థి లోపాలను సవరించుకుని తర్ఫీదు పొందే వెసులుబాటు ఉండేది. వార్షిక విధానంలో సిలబస్‌ పూర్తయినా కాకపోయినా విద్యా సంవత్సరాంతంలో ఒకేసారి పరీక్షలు రాసే విధానం అమల్లోకి రావటం విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కొత్త పరిచయాలతో దిగాలుగా ఉండే విద్యార్థులను గుర్తించి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇచ్చే విధానం లేదు. రెగ్యులర్‌ వీసీ లేకపోవటం సమస్యలన్నింటికీ ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇదే ప్రధాన డిమాండ్‌గా 2022 జూన్‌లో విద్యార్థులంతా నెలరోజుల పాటు మూకుమ్మడిగా ఆందోళన దిగటంతో అప్పటి కేసీఆర్‌ సర్కార్‌ దిగివచ్చింది. నెలరోజుల్లోగా అన్ని సమస్యలు తీరుతాయని అప్పటి మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఆచరణకు రాలేదు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సర్కారు ఏర్పడినప్పటికీ శాశ్వత వీసీ నియామకం జరగక విశ్వవిద్యాలయంపై పర్యవేక్షణ కొరవడుతోంది. విషయాలు బయటకు పొక్కకుండా భయపెట్టడం మినహా రెండేళ్ల కిందట విద్యార్థులు లేవనెత్తిన అంశాలేవీ పరిష్కారం కాలేదు. ఫలితంగా కొత్తగా ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులు నూతన విధానంపై అవగాహన చేసుకోలేక తనువు చాలించడానికి దారితీస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని