logo

అక్రమ దందా.. అధికారుల అండ

రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 24 Apr 2024 07:18 IST

రాయితీ బియ్యం రవాణాలో పోలీసులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు

తాండూరు మండలం రేచిని గ్రామ సమీపంలో పట్టుకున్న రేషన్‌ బియ్యం(పాతచిత్రం)

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: రాయితీ బియ్యం దందా చూడడానికి మామూలుగా అనిపిస్తుంది. దీనిపై లోతుగా తెలుసుకుంటే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. లక్షల్లో నెలవారీగా మామూళ్లు చెల్లిస్తున్నారంటే వారికి బియ్యం అక్రమ రవాణా మీద ఎంత ఆదాయం సమకూరుతుందో అర్థమవుతుంది. ఇదో పెద్ద మాఫియాలాగా మారింది. వీటి రవాణా సమాచారం ఇచ్చిన వారి వివరాలు సేకరించి మరీ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి ఉంది. గ్రామాల్లో తిరిగి సేకరించి, డీలర్లనుంచి తీసుకుని టన్నుల కొద్దీ లారీల్లో బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో దొడ్డు బియ్యానికి డిమాండ్‌ కనిపిస్తుంది. ఇక్కడ తక్కువ ధరకు కొని మహారాష్ట్రలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. కొంతమంది పోలీసులతోపాటు ఇతర వర్గాల వారికి కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి ప్రతి నెలా మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 రైళ్లలో బంద్‌... లారీల్లో తరలింపు

గతంలో భాగ్యనగర్‌తో పాటు మరికొన్ని రైళ్లలో రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రలోని వీరూర్‌కు అక్రమ రవాణా చేసేవారు. రైల్వే శాఖ బియ్యం రవాణాను సీˆరియస్‌గా తీసుకుని అడ్డుకుంది. ఎక్కడికక్కడ రైల్వే పోలీసులు రంగ ప్రవేశం చేసి తరచూ తనిఖీలు చేయడంతో ఆ దందా నిలిచిపోయింది. స్థానిక దళారులే బియ్యాన్ని ఇంటింటికీ తిరుగుతూ సేకరించి వాటిని అక్రమంగా రెబ్బెనలోని ఓ వ్యాపారి వద్దకు పంపుతున్నారు. ఇదే సమయంలో రేషన్‌డీలర్లు సైతం లబ్ధిదారుల వద్ద రూ.10 నుంచి రూ.12 వరకు కొనుగోలు చేసి స్థానిక దళారులకే అప్పగిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ఎంతో కొంత లాభం చూసుకుని విక్రయిస్తున్నారు.

అంతా ‘మామూలుగా’

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన ఓ వ్యాపారి నిర్మించుకున్న రేషన్‌ సామ్రాజ్యం మామూలుగా ఉండదు. అంతా మామూళ్లమయమే చేసేశాడు. రెండు జిల్లాల్లో ఈ దందా కొనసాగిస్తున్నాడంటే అతనికి ఏ స్థాయిలో అండదండలు ఉన్నాయో అర్థమవుతుంది. రాయితీ బియ్యం అక్రమ రవాణా అధిపతి మీద ఈగ వాలిన కాపాడడానికి మేమున్నామంటూ చాలా మంది ముందుకు వస్తారంటే అతిశయోక్తి కాదు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాల వలే మామూళ్లు ఇస్తున్నారంటే రాయితీ బియ్యం దందా ఏ స్థాయిలో కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల నుంచి రాయితీ బియ్యం మొత్తం ఇతని వద్దకే వెళుతుంది. అక్కడి నుంచి లారీల్లో మహారాష్ట్రకు తరలిస్తుంటారు.

షరతు విధించి..

జిల్లాలోని కొన్ని మండలాల రాజకీయ నాయకులు తాము చెప్పినోళ్లకే రాయితీ బియ్యం విక్రయించాలని షరతులు విధిస్తున్నారు. ఇలా  మాటలతోనే రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. స్థానికంగా దళారులను సృష్టించి దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు నాయకులకు తెలియకుండా బియ్యం మండలం నుంచి బయటకు పోకుండా చూస్తుంటారు.

ఇలా విక్రయిస్తారు

గ్రామాలు, పట్టణాల్లో నేరుగా లబ్ధిదారుల వద్ద రేషన్‌డీలర్లు కొనడం ఒక మార్గం. మరో మార్గంలో లబ్ధిదారుల వద్ద నుంచి సేకరించడం. ఈ స్థాయిలో కిలో రేషన్‌ బియ్యానికి రూ.10 నుంచి రూ.12 వరకు స్థానిక దళారులు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత వీరు వెళ్లి సదరు వ్యాపారికి రూ.16 నుంచి రూ.18కు విక్రయిస్తారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించి రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముతుంటారు. లక్షల్లో వ్యాపారం జరుగుతుండడంతో రాయితీ బియ్యం దందా కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని