logo

15 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌

విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ రమేష్‌ ఉపాధ్యాయులను హెచ్చరించారు.

Published : 05 Feb 2023 03:08 IST

విద్యార్థి ట్యాబ్‌ని పరిశీలిస్తున్న డీఈఓ రమేష్‌

కొయ్యూరు, న్యూస్‌టుడే: విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ రమేష్‌ ఉపాధ్యాయులను హెచ్చరించారు. శనివారం కొయ్యూరు ప్రభుత్వోన్నత, మంపలోని ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ రెండు పాఠశాలల్లోని 15 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వోన్నత పాఠశాలలోని తరగతులన్నింటినీ సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు గణితంలోని త్రికోణమితి సూత్రాలను అడిగారు. విద్యార్థులు సక్రమంగా చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరో తరగతి విద్యార్థులు రాసిన నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. కొన్ని పాఠ్యాంశాలపైనే రాసి, మిగిలిన వాటిని రాయకపోవడాన్ని గుర్తించారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లు పరిశీలించారు. వీటి వినియోగంపై మానిటరింగ్‌ అధికారి శివప్రసాద్‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మీరెందుకు పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పడం లేదని ప్రధానోపాధ్యాయుడు రామారావును డీఈఓ ప్రశ్నించారు. విద్యార్థులు ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సరిగా బోధించడం లేదంటూ ఈ పాఠశాలలోని 11 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో సాంబారులో పప్పు సరిగా కనిపించడం లేదని, ఇకపై ఎక్కువ వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. మంపలోని అల్లూరి స్మారక ఉద్యానాన్ని సందర్శించారు. మంప ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక ఉద్యానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న 70 మంది ఉపాధ్యాయులకు ఇప్పటివరకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎంఈఓ బోడంనాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని