logo

అవకాశం వచ్చింది.. త్వరపడితే మంచిది

 బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది.

Published : 29 Mar 2024 02:39 IST

పాడేరు, నక్కపల్లి, న్యూస్‌టుడే : బాలికల విద్యకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్‌ నుంచి నోటిఫికేషన్‌ విడుదలైంది. 

ఉమ్మడి జిల్లాలో 39 కస్తూర్బా పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఇందులో ఆరు నుంచి ఇంటర్‌ వరకు తరగతులున్నాయి. అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఆరో తరగతికి 800, ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు 800 ఖాళీలున్నాయి. వీటితో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది స్థానికంగా ఉన్న ఖాళీలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో చదువుకునే వారికి ఉచితంగా బోధన, వసతి, భోజనం ఉంటుంది. బోధనతో పాటు, ప్రతిరోజూ విధిగా వ్యాయామం, యోగాసనాలు, ఆటపాటలుంటాయి.

 అర్హులు వీరే... అనాథలు, తల్లి గానీ తండ్రిగానీ లేనివారు, మధ్యలో బడి మానేసినవారు, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన కులాలవారికి వారికి అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారంతా సమీపంలోని ఆన్‌లైన్‌ సెంటర్‌కు వెళ్లి తమ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు/సంరక్షకుల ఆధార్‌ కార్డులు, కుల ధ్రువీకరణ, దరఖాస్తుదారు పాస్‌పోర్టుసైజ్‌ ఫొటో, జనన ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ, స్టడీ, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబరు వివరాలు అప్‌లోడ్‌ చేయించాలి.
ఇంటర్‌లో కోర్సులు... ఎంఈసీ: చీడికాడ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(నర్సింగ్‌): గొలుగొండ, రోలుగుంట, కె.కోటపాడు, ఎం.ఎల్‌.టి.(ల్యాబ్‌ టెక్నీషియన్‌): రాంబిల్లి, చోడవరం, ఎంపీసీ: మునగపాక, దేవరాపల్లి, మాకరవపాలెం, ఎస్‌.రాయవరం, బైపీసీ: నాతవరం, కోటవురట్ల, నక్కపల్లి, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం, నర్సీపట్నం, కశింకోట, వి.మాడుగుల, సబ్బవరం, రావికమతం.
దరఖాస్తుల గడువు వచ్చే నెల 11 వరకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అల్లూరి జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్‌ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 19 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, కళాశాలలు ఉన్నాయని చెప్పారు. 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశాలకూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 19 విద్యాలయాల్లో మొత్తం 760 ఖాళీలకు ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

అవకాశం వినియోగించుకోవాలి...

కేజీబీవీల్లో బోధన, సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఏటా ఇక్కడ మంచి ఫలితాలు వస్తున్నాయి. బోధనే కాకుండా, ఇతర నైపుణ్యాలపైనా ఇందులో శిక్షణ ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్‌ 11వ తేదీ వరకు గడువుంది. అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరిచే సమయానికి అర్హులంతా తరగతుల్లో చేరిపోతారు. ఏమైనా సందేహాలుంటే స్థానికంగా ఉన్న కేజీబీవీల్లో, 18004258599 నంబర్‌కు  సంప్రదించొచ్చు. -ఎం.వెంకట లక్ష్మమ్మ, డీఈఓ
కేజీబీవీల్లో  ప్రవేశాలకు  దరఖాస్తుల  స్వీకరణ
విద్యార్థినులకు బోధన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని